Share News

puttaparthy భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లలో కక్కుర్తి..!

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:27 PM

భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లలో అటు వినియోగదారులు, ఇటు అధికారులు కక్కుర్తికి పాల్పడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారి ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు.

puttaparthy భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లలో కక్కుర్తి..!
మున్సిపల్‌ కార్యాలయం

ప్రభుత్వ ఆదాయానికి గండి

సిబ్బంది చేతివాటం

నిద్రమత్తులో అధికారులు

గృహాలు ఎక్కువ.. కనెక్షన్లు తక్కువ

పుట్టపర్తి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లలో అటు వినియోగదారులు, ఇటు అధికారులు కక్కుర్తికి పాల్పడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారి ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. దేశ విదేశీ భక్తులతో నిత్యం సందడిగా ఉండే పుట్టపర్తిలో శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ 2000వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. ఇందులో పుట్టపర్తి, గోకులం, ఎనుములపల్లి కొంత ప్రాంతం, ప్రశాంతి గ్రామంలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటుచేశారు. అడ్డగోలుగా ఎవరికివారే కనెక్షన తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పట్టణంలో వ్యక్తిగత గృహాలు, లాడ్జిలు, అపార్ట్‌మెంట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. మొత్తం కనెక్షన్లు 5,853 మాత్రమే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజీ తీసుకోవాలంటే ఇందుకు ప్రభుత్వానికి కొంత డబ్బు చెల్లించి తరువాత ప్రతిఏడాది పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా అక్రమ కనెక్షన్లు కొనసాగుతున్నాయి. దాదాపు 500కు పైగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్‌ ప్లాట్లు వేల సంఖ్యలో ఉన్నాయి.

ఒక అపార్ట్‌మెంట్‌లో అధికారికంగా రెండు లేదా మూడు కనెక్షన్లు తీసుకుని మిగిలిన వాటిని అక్రమంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లాడ్జిలు, గృహాలు సైతం డ్రైనేజీలలో పైపులు కలుపుకుని పన్నులు చెల్లించకుండా ఎగ్గొతున్నట్టు తెలిసింది.

సిబ్బంది చేతివాటం

ఇంటి పక్కనే డ్రైనేజీ పైపు పోతోంది. మూరెడు పైపుతో కనెక్షన వస్తుందన్న ఆశతో వినియోగదారులు అనుమతులు లేకుండా సిబ్బందికి కొంత డబ్బు చేతిలోపెట్టి మురికి నీటిని భూగర్భ డ్రైనేజీలో కలుపుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరైతే రాత్రికిరాత్రే రోడ్డును తవ్వేసి భూగర్భ డ్రైనేజీలో కలుపుకుంటున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా వేసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుందని, ఇవేవి లేకుండా సిబ్బందితో కుమ్మక్కై కనెక్షన్లు అక్రమంగా తీసుకుంటున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

అక్రమ కనెక్షన్లను తొలగిస్తాం

మున్సిపాలిటీ పరిధిలో అక్రమ డ్రైనేజీ కనెక్షన్లు ఎవరు తీసుకున్నా ఉపేక్షించేదిలేదు. వాటిని వెంటనే తొలగిస్తాం. కనెక్షన కావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

-ప్రహ్లాద, కమిషనర్‌

Updated Date - Apr 07 , 2025 | 11:27 PM