CPI అక్రమ భవనాలను ఎందుకు కూల్చరు?
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:14 AM
పట్టణ నడిబొడ్డున జాతీయ రహదారి పక్కన సహకార సొసైటీ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రశ్నించారు.

ముదిగుబ్బ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): పట్టణ నడిబొడ్డున జాతీయ రహదారి పక్కన సహకార సొసైటీ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రశ్నించారు. గురువారం సీపీఐ నాయకులు ఆధ్వర్యంలో సహకార సొసైటీ స్థలం కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సొసైటీ సీఈఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ.. సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణం గల సొసైటీ స్థలాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ఈ స్థలంలో ఒక మూలన ఇటీవల అక్రమంగా నిర్మించారని ఒక చిన్న రేకుల షెడ్డును రెండురోజుల కిందట కూల్చివేసిన అధికారులు, జాతీయ రహదారి పక్కన ఎంతో విలువ చేసే సొసైటీ స్థలంలో అక్రమంగా నిర్మించిన పెద్ద భవనాలను కూల్చివేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు కొంతమంది అక్రమ కట్టడాల నిర్మాణం పై హైకోర్టును ఆశ్రయించినా.. నేటికి ఎటువంటి ప్రయోజనం లేకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా సొసైటీ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సౌత స్టేట్స్ గౌరవాధ్యక్షుడు వెంగమేష్ చౌదరి, సీపీఐ నాయకులు తిప్పయ్య, నాయుడు, చిన్నప్ప, ఈశ్వర్ నాయక్ పాల్గొన్నారు.