AP Govt: సన్నరకాల వరి సాగుకు ప్రోత్సాహం
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:33 AM
ముతక రకాలు, గింజ లావు రకాలు అమ్ముడుపోక, ఎగుమతి కాక, పౌరసరఫరాల ద్వారా పంపిణీ చేసినా ప్రజలు తినక సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రి అచ్చెన్న అధ్యక్షతన భేటీలో నిర్ణయం
ముతక రకాల సాగు విస్తీర్ణం కుదింపు
ప్రత్యామ్నాయ రకాలు సూచించాలని ఎన్జీ రంగా వర్సిటీకి ఆదేశం
ఎగుమతికి అనువైన బియ్యం ఉత్పత్తికి ప్రణాళికలు
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సన్నరకాల వరి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముతక రకాలు, గింజ లావు రకాలు అమ్ముడుపోక, ఎగుమతి కాక, పౌరసరఫరాల ద్వారా పంపిణీ చేసినా ప్రజలు తినక సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సన్నరకాల వరి సాగు, ఉత్పత్తిని పెంచే ప్రణాళికలో భాగంగా సోమవారం అమరావతి సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, పౌరసరఫరాల సంస్థ ఎండీ మనజీర్ జిలానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయ రీసెర్చ్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, రైతుప్రతినిధులు పాల్గొన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ మండలాల్లో పండుతున్న వరి రకాలు, సాగు విస్తీర్ణం, ఉత్పత్తిపై వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖరీ్‌ఫలో ఎంటీయూ- 1121,1061,1064, పీఆర్126, రబీలో ఎంటీయూ-1121, 1153, పీఆర్ 126 రకాల విస్తీర్ణాన్ని తగ్గించాలని, ఈ రకం ధాన్య సేకరణను నిలిపివేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటికి ప్రత్యామ్నాయ రకాలను సూచించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కోరారు. సన్న రకాలైన బీపీటీ-5204, 3291, ఆర్‌ఎన్‌ఆర్ 15049, ఎంటీయూ 1224, ఆర్‌జీఎల్ 2537, ఎన్‌ఎల్‌ఆర్ 34449, ఎన్‌డీఎల్‌ఆర్7, పీఎల్‌ఏ 1100, జేజీఎల్ 384, హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్ వంటి రకాలను సాగు చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.
అగ్రిమిషన్ సభ్య కార్యదర్శిగా మండవ
రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యకార్యదర్శిగా బాపట్ల వ్యవసాయ విస్తరణ విభాగం ప్రొఫెసర్ మండవ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఓడీపై రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.