Global Summit : దావోస్‌లో ‘బ్రాండ్ ఏపీ’
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:29 AM
ఐదేళ్లు దెబ్బతిన్న ‘బ్రాండ్ ఏపీ’ని అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించేందుకు కూటమి సర్కారు రంగం సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు...

3 రోజులపాటు చంద్రబాబు పర్యటన.. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీలు
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యం.. నేటి అర్ధరాత్రి దావో్‌సకు పయనం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఐదేళ్లు దెబ్బతిన్న ‘బ్రాండ్ ఏపీ’ని అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించేందుకు కూటమి సర్కారు రంగం సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఒకేచోట చేరే దావోస్ ఆర్థిక సదస్సును దీనికి వేదికగా మార్చుకోనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు... ఆదివారం రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బయలు దేరివెళ్లనున్నది. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా మూడు రోజులు వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఒకే చోట పలువురు దేశాధినేతలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల అధిపతులను కలిసే అవకాశం దావోస్‌లో లభిస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇదొక అద్భుత అవకాశం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఒకేఒక్కసారి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అది కూడా... అయిష్టంగా, అన్యమనస్కంగానే! దీంతో... అంతర్జాతీయ యవనికపై ‘బ్రాండ్ ఏపీ’ గురించి ప్రచారం చేసే అవకాశమే లభించలేదు. ఇప్పుడు... చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే దావోస్ ఆర్థిక సదస్సులో ఏపీ పెవిలియన్ కొలువు తీరుతోంది. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు కనీసం 30 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యేలా ప్రణాళిక రచించారు. ముందే ఖరారైన భేటీలతోపాటు... అప్పటికప్పుడు అవకాశాన్నిబట్టి ఇతరులతోనూ సమావేశమవుతారు.
తొలి రోజు... దావోస్ పర్యటనలో తొలిరోజున చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారితో సమావేశమవుతారు. ఆ తర్వాత హిల్టన్ హోటల్‌లో పది మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్‌లోని ప్రవాసాంధ్రులతో ‘మీట్ అండ్ గ్రీట్’తో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి పలువురు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో డిన్నర్‌లో పాల్గొంటారు.
రెండో రోజు ఇలా... దావోస్‌లో రెండో రోజున సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై జరిగే చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత సోలార్ ఇంపల్స్ కోకొకోలా, వెల్‌స్పన్, ఎల్‌జీ , క్లార్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌తో చర్చలు జరుపుతారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహించే ‘ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్’ అనే అంశంపై చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల విధానాలను వివరిస్తారు.
మూడో రోజు...
దావోస్‌లో మూడోరోజున పలు దిగ్గజ సంస్థల అధినేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. నాలుగోరోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటారు. సీఎం బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు పరిశ్రమల శాఖ, ఈడీబీ అధికారులు ఉంటారు.