Tax Collection: పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:58 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి.

గత 10 నెలల్లో ఫిబ్రవరిలోనే అత్యధికం.. పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ విషయం జీఎస్టీ వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గత 10 నెలల కాలంలో అత్యధికంగా నికర జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.2,597 కోట్ల నికర జీఎస్టీ వసూలు కాగా.. ఫిబ్రవరిలో రూ.2,936 కోట్లు వచ్చాయి. జనవరిలో ఇది రూ.2,879 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో ఆర్థికపరమైన కార్యకలాపాలు ఊపందుకున్నాయనే దానికి జీఎస్టీ వసూళ్లు పెరగడం అనేది ఒక సంకేతంగా చెప్పవచ్చు. మొత్తం స్థూలంగా గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 3.79 శాతం పెరిగాయి. కాగా, జీఎస్టీ ఆదాయంపై విశ్లేషించే కమిటీలోకి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను సభ్యుడిగా తీసుకున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కన్వీనర్‌గా నియమించారు.