Share News

Kisan Credit Card : కేసీసీ రుణ పరిమితి పెంపుతో రైతులకు మేలు

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:42 AM

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు(కేసీసీ)పై రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం తాజా బడ్జెట్‌లో...

Kisan Credit Card : కేసీసీ రుణ పరిమితి పెంపుతో రైతులకు మేలు

  • రాష్ట్రంలో లక్షలాది మందికి కిసాన్‌ కార్డులు

  • కాటన్‌, విత్తన మిషన్లతో పత్తి రైతులకు నాణ్యమైన వంగడాలు, గిట్టుబాటు ధరలు

అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కిసాన్‌ క్రెడిట్‌ కార్డు(కేసీసీ)పై రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం తాజా బడ్జెట్‌లో ప్రకటన చేయడంపై రైతుల్లో హర్షం వ్యక్తమౌతోంది. వ్యవసాయ, ఉద్యాన రైతులు, కౌలు సాగుదారులు, పశుపోషకులు, ఆక్వా రైతులు పెట్టుబడుల కోసం తీసుకునే రుణాల పరిమితి పెరగనున్నది. కేసీసీపై తీసుకునే రుణంపై రైతులు కేవలం 4 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి 7 శాతం వడ్డీ పడనుండగా, అందులో కేంద్రం 3 శాతం రాయితీ ఇవ్వనున్నది. పైగా కేసీసీపై రుణానికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనా ఈ రుణం తీసుకోవచ్చు. ఇందులో రూ.2 లక్షల లోపు రుణానికి ఎలాంటి పూచీకత్తు అవసరం ఉండదు. ఏపీలో లక్షలాది మందికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంతో రైతులకు మేలు జరగనున్నది. మరోవైపు కేంద్రం 2025-26 బడ్జెట్‌లో కాటన్‌ మిషన్‌, జాతీయ విత్తన మిషన్‌ను ప్రతిపాదించింది. ఇవి ఏర్పాటైతే పత్తి అధికంగా పండించే ఏపీ రైతులకు నాణ్యమైన వంగడాలు లభ్యం కావడంతో పాటు పత్తికి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 02 , 2025 | 04:42 AM