CM Chandrababu : ఢిల్లీని భ్రష్టుపట్టించారు
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:24 AM
1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున....

ఆప్ పాలనలో అభివృద్ధికి దూరమైన రాజధాని
పదేళ్లలో కనీసం ప్రజలకు తాగునీరూ ఇవ్వలేదు
1995 నాటి హైదరాబాద్‌లా ఇప్పటి ఢిల్లీ ఉంది
డబుల్ ఇంజన్ సర్కారు ఉండి ఉంటే వాషింగ్టన్,
న్యూయార్క్‌ను తలదన్నేలా అభివృద్ధి చెందేది
ప్యాలెస్‌లు కట్టుకున్నవారిని ఇంటికి పంపించాలి
తెలుగు వారంతా బీజేపీకే ఓటేయాలి
ఢిల్లీ ప్రచార సభలో సీఎం చంద్రబాబు పిలుపు
తెలుగు వారికి తోడుగా ఉంటానని భరోసా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛభారత్‌లో దేశం దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికికూపంగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. షహదారా ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలోకి ఉన్నప్పటికీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధి బాట పట్టాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు అవసరాన్ని ఇంటింటికీ వెళ్లి వివరించాల్సిన బాధ్యత తెలుగు తమ్ముళ్లు, చెలెళ్లపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ చరిత్రకు ఒక మలుపు అన్నారు. అధికారం కోసం కాదు... ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయాలని అన్నారు. ఆయారాం, గయారాంలు కాదు.. సుస్థిర పాలన అందించాలని, ప్యాలె్‌సలు కట్టుకునేవారిని కాదు... ప్రజలకు చిత్తశుద్ధితో సేవచేసేవారిని ఎన్నుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.‘దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఒక్కప్పుడు బిహార్ నుంచి ఇక్కడికి ఉపాధికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇక్కడి పాలకుల తీరుతో యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారు.
ఆప్ పాలనలో అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయలు లేవు. గాలి కాలుష్యం తట్టుకోలేనంతగా ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు వచ్చి ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్‌ను ఢిల్లీ తలదన్నేది. బీజేపీని గెలిపిస్తే సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రజలకు అందుతాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏడు నెలల్లో 7 లక్షల కోట్లు తెచ్చాం
‘ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే ప్రత్యర్థి పార్టీ గల్లంతైంది. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఏడు నెలల్లోనే రాష్ట్రానికి రూ.7లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. డబుల్ ఇంజన్ సర్కారుతోనే ఇది సాధ్యమైంది. రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ ఆ ప్యాలె్‌సలోకి ప్రవేశించేలోపే ఇంటికి వెళ్లారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ బ్రహ్మాండమైన శీష్ మహల్ కట్టారు. ఆ మహల్‌లోకి ప్రవేశించడానికి ముందే మీరు చిత్తుగా ఓడించాలి. తెలుగు వారు ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలి. మీకు అండగా, తోడుగా నేనుంటా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘పెట్టుబడుల కోసం ఇటీవల దావోస్ వెళ్లినప్పుడు 650 మంది అక్కడ ఉన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడాను... ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. వికసిత్ భారత్‌లో భాగంగా 2047 కల్లా దేశం నెంబర్ వన్ అవుతుంది. భారతీయులు శక్తిమంతమైన జాతిగా మారతారు’’ అని చంద్రబాబు తెలిపారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తారని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, బస్తీపాటి నాగరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, బైరెడ్డి శబరి, జీఎం హరీష్, బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హస్తినలో తెలుగు నేతల ప్రచారం
ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోడానికి బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు అధికారాన్ని చేజిక్కిచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీపై విజయం సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా తెలుగు ఓట్లపై ప్రత్యేక దృషి సారించింది. ఢిల్లీలో తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రజలు దాదాపు 8లక్షల మంది ఉన్నారు. వీరిలో సుమారు 3లక్షల మంది వరకు ఓటర్లు ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు తెలుగు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీని గెలిపించాలని కోరుతూ టీడీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. సోమవారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి తెలుగు సంఘాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో తెలుగు సంఘాల అభివృద్థికి కృషి చేయాలని చంద్రబాబుకు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రాత్రి 8.15 గంటలకు ఢిల్లీలోని సహద్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. త్రినగర్ అసెంబ్లీ అభ్యర్థి తిలక్‌రామ్ గుప్తా తరఫున పెమ్మసాని సతీమణి శ్రీ రత్న, ఆయన కుమార్తె ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News