Share News

Srikakulam: డాక్టర్‌ రెడ్డీ‌స్‌లో చోరీ

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:28 AM

చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతున్న మధుమేహం వ్యాధి నియంత్రణపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ మధుమేహం టైప్‌ 2పై చేసిన పరిశోధనలు సత్‌ఫలితాలను ఇచ్చాయి.

Srikakulam: డాక్టర్‌ రెడ్డీ‌స్‌లో చోరీ

  • కోట్లు విలువ చేసే మాలిక్యూల్‌ దొంగతనం.. యాజమాన్యం ఫిర్యాదు

  • మధుమేహం నియంత్రణ పరిశోధనల్లో అత్యంతకీలకమది

రణస్థలం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతున్న మధుమేహం వ్యాధి నియంత్రణపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ మధుమేహం టైప్‌ 2పై చేసిన పరిశోధనలు సత్‌ఫలితాలను ఇచ్చాయి. ఇందుకు సంబంధించి ఒక మాలిక్యూల్‌ని ఆవిష్కరించింది. పౌడర్‌ రూపంలో ఉన్న దాన్ని మరింత అభివృద్ధి చేసి మాత్రలు, ఇంజక్షన్ల రూపంలో తేవాలని నిర్ణయించింది. ఆ పౌడర్‌ను శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రెడ్డీస్‌ ల్యాబ్‌లో భద్రపరచింది. రూ.కోట్ల విలువ చేసే ఆ పౌడర్‌ యూనిట్‌ నుంచి మాయమైంది. పరిశ్రమ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. .


మన దేశంలో అందుబాటులో తేవాలని..

ఐరోపా, దక్షిణాఫిక్రా దేశాల్లో మధుమేహం వ్యాధి నియంత్రణకు అనేక రకాల మందులు, సెమాగ్లూటైడ్‌ వంటి ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ప్రత్యేక మందులు అందుబాటులోకి తేవాలని ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా డాక్టర్‌ రెడ్డీస్‌ అత్యాధునిక పరిశోధన పరిజ్ఞానంతో ‘పెప్‌టైడ్‌’ తరహా మాలిక్యూల్‌ని పౌడర్‌ రూపంలో అభివృద్ధి చేసింది. టైప్‌ 2 మధుమేహాన్ని అత్యంత సమర్థవంతంగా నియంత్రించగలిగేలా ఈ యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రెడెంట్‌(ఏపీఐ)ని ఫార్ములేట్‌ చేసినట్లు సమాచారం. ఈ ఫార్ములా తయారీకి యాజమాన్యం రూ.కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. మొత్తం 450 గ్రాముల పౌడర్‌ను వేర్వేరు ప్యాకెట్లలో జాగ్రత్తగా భద్రపరిచారు. గత నెల 17న దీనిని ఉంచగా... ఈ నెల 3న అదృశ్యమైనట్టు గుర్తించారు. ఘటనపై డాక్టర్‌ రెడ్డీస్‌ సైట్‌ హెడ్‌ గణేశ్‌ శంకరన్‌ డ్రగ్‌ అథారిటీ్‌సకు, శ్రీకాకుళం జిల్లా జేఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ లభ్యంకాని ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.


భద్రత డొల్ల?

కట్టుదిట్టమైన భద్రత. నిఘా ఎక్కువగా ఉన్న కంపెనీలో రూ.కోట్ల విలువ చేసే ప్రజారోగ్యానికి సంబంధించిన డ్రగ్‌ చోరీకి గురికావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీని వెనుక విద్రోహ చర్య ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు మందుల పరిశోధనల్లో ఫార్మా కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసేవారిని లోబరచుకుని ఈ ఘటనకు పాల్పడ్డారా అన్న సందేహమూ బలంగానే ఉంది. ఈ ఘటనపై డాక్టర్‌ రెడ్డీస్‌ యాజమాన్యం తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిపై వేటు వేసినట్టు సమాచారం. ఘటన జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ చేపట్టారు. పోలీసులు అక్కడ పనిచేసే సిబ్బంది కదలికలపై దృష్టి పెట్టారు. బయో పరిశోధనలకు సంబంధించిన అంశం కావడంతో డ్రగ్‌ అథారిటీ సైతం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. కాగా, ఫిర్యాదు వాస్తవమేనని, కేసు దర్యాప్తు చేస్తున్నామని జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎన్‌ చిరంజీవి తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 03:28 AM