12వ పీఆర్సీని నియమించి.. ఐఆర్ ప్రకటించాలి
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:50 AM
సార్వత్రిక ఎన్నికల వేళ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీని నియమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోనసీమ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.

అమలాపురం రూరల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల వేళ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీని నియమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోనసీమ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. వెంటనే ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. జిల్లా పెన్షనర్స్ కార్యాలయంలో మంగళవారం ఎం.సాయివరప్రసాద్ అధ్యక్షతన జిల్లాలోని అన్ని యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పెన్షనర్లకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి పది నెలలు గడిచినా పెన్షనర్లకు సంబంధించి ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రతీ నెల మొదటి వారంలోనే పెన్షన్‌లు జమ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండల స్థాయి నుంచి అసోసియేషన్‌ను బలోపేతం చేయడంతో పాటు శాశ్వత సభ్యులను చేర్చుకోవాలని సాయివరప్రసాద్ సూచించారు. సెప్టెంబరు లోగా జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వం పెన్షనర్లకు మూడు విడతల కరువు భృతి చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు చెల్లించలేదని రాష్ట్ర కార్యదర్శి ఎన్వీఎస్‌ఎస్ సీహెచ్ కృష్ణమూర్తి పేర్కొన్కారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. కోశాధికారి జి.సోమేశ్వరశర్మ ఆర్థిక నివేదికను సభ ముందు ఉంచారు. సమావేశంలో వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు వై.సత్తిరాజు, ఏవీ సుబ్బారావు, ఏవీవీ సత్యనారాయణ, డి.సత్యనారాయణ, జీవీఎస్ సత్యనారాయణ, జి.నరసింహారావు, వైఎస్ జగన్మోహనరావు, టీవీ శర్మ, వై.పాండురంగారావు, మండలీక ఆదినారాయణ, పప్పుల శ్రీరామచంద్రమూర్తి, మహబూబ్ షాహీరా తదితరులు పాల్గొన్నారు.