భయపెడుతున్నారు.. బెదిరిస్తున్నారు!
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:43 AM
పురపాలక సంఘంలో అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సహా బిల్‌కలెక్టర్లను సైతం మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బతకనివ్వడంలేదని అధికారపక్ష వైసీపీ కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడానికి అదే కారణమన్నారు. ఉద్యోగులు, సిబ్బందిని ఆమె భర్త బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారన్నారు. జరుగుతున్న పరిణామాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి చైర్మన్‌పర్సన్‌పై అవిశ్వాసం తీసుకువస్తామని ఆయన అన్నారు.

పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అవిశ్వాసం పెడతాం
అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త తీరుపై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం
నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన అధికారులు
అమలాపురం టౌన్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘంలో అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సహా బిల్‌కలెక్టర్లను సైతం మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బతకనివ్వడంలేదని అధికారపక్ష వైసీపీ కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడానికి అదే కారణమన్నారు. ఉద్యోగులు, సిబ్బందిని ఆమె భర్త బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారన్నారు. జరుగుతున్న పరిణామాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి చైర్మన్‌పర్సన్‌పై అవిశ్వాసం తీసుకువస్తామని ఆయన అన్నారు. అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన వాదోపవాదాల నడుమ గురువారం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. మున్సిపల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడానికి దారితీసిన పరిస్థితులపై అధికార వైసీపీ కౌన్సిలర్లే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తొలుత చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి పత్రికల్లో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ రాసుకొచ్చిన స్ర్కిప్టును యథాతథంగా చదివేశారు. నేను, నా భర్త ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, తిట్టలేదని వివరణ ఇచ్చారు. పలువురికి శాపనార్థాలు పెడుతూ అంతా దేవుడే చూ సుకుంటాడు అని చైర్‌పర్సన్ అనడంతో మరోసారి కౌన్సిలర్ నాగేంద్ర విరుచుకుపడ్డారు. పురపాలక సంఘంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలిగించకుండా పనిచేసే రాజీవ్ అనే ఉద్యోగిని ఇక్కడి నుంచి పంపించేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడానికి గల కారణాలను మున్సిపల్ ఆర్వో శ్రీలక్ష్మి వివరించారు. నాలుగు నెలల కిందటే వచ్చిన ఉద్యోగి రాజీవ్ పట్ల వ్యవహరించిన తీరుతోనే ఇలా చేశామని, లిఖిత పూర్వకంగా నిరసన తెలుపుతామని కమిషనర్‌కు లేఖ ఇవ్వలేదని, నోటిమాటగా మాత్రమే చెప్పామని వివరణ ఇచ్చారు. ఆరు నెలలోపు ఉద్యోగిని బదిలీ చేయరాదనే నిబంధన ఏమైనా ఉందా అని ఎమ్మెల్యే ఆనందరావు మున్సిపల్ ఉద్యోగులను ప్రశ్నించారు. ఒక దశలో బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారా అని హెచ్చరించారు. అసెంబ్లీ మాదిరిగానే కౌన్సిల్ కూడా చట్టసభ అన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అని మండిపడ్డారు. ఈ విషయంపై కలెక్టర్ లేదా ఆర్డీవోతో విచారణ జరిపించమంటారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై చైర్‌పర్సన్, అధికారపక్ష కౌన్సిలర్ల మధ్య ఒక దశలో వాగ్వివాదం చోటు చేసుకుంది. పత్రికల్లో వచ్చిన కథనాలను తీసుకువచ్చి సభా సమయాన్ని వృథా చేయడం తగదని వైసీపీ కౌన్సిలర్ సంసాని బులినాని చైర్‌పర్సన్‌కు హితవు పలికారు. క్లాప్ ప్రోగ్రాంలో భాగంగా పెండింగ్ బకాయిలకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ. 20.49 లక్షలు చెల్లించే అంశంపై పనిచేస్తున్న ఆటో టిప్పర్ల డ్రైవర్లకు జీతాలు చెల్లిస్తున్నారా అని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో యూజర్ చార్జీలు వసూలు చేయడం వల్ల జీతాలు చెల్లించేవారమని, కూటమి ప్రభుత్వం యూజర్ చార్జీలను ర ద్దు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు వివరణ ఇచ్చారు. అనేక అంశాలపై కౌన్సిలర్లు యేడిద శ్రీను, పిండి అమరావతి, నాగారపు వెంకటేశ్వరరావు, బండారు గోవిందు తదితరులు మాట్లాడగా అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కార్పొరేషన్‌గా మారితేనే సంపూర్ణ అభివృద్ధి : ఎమ్మెల్యే ఆనందరావు
ఉమ్మడి తూర్పుగోదావరిలో రాజమహేంద్రవరం, కాకినాడ అభివృద్ధి చెందినంతగా అమలాపురం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలను కౌన్సిలర్లు గుర్తించాలని ఎమ్మె ల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం పట్టణ, పరిసర గ్రామాలను విలీనంచేసి కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసిననాడే పట్టణాభివృద్ధి సంపూర్ణ స్థాయిలో జరుగుతుందన్నారు. అమలాపురం పట్టణాభివృద్ధికి అందరూ సమన్వయంతో పంపించిన మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిందని, అయితే కౌన్సిల్ చెప్పినట్టు జరగలేదన్నారు. మాస్టర్ ప్లాన్‌కు సవరణ చేయాల్సి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, భవిష్యత్తు అవసరాల కోసం ఏడు బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉండగా ప్రస్తుత వేసవి సీజన్‌లో రెండు బ్రిడ్జీలు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు ఆనందరావు సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, కానీ అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వని పరిస్థితిని వివరించారు. రైల్వేలైన్ మార్పు అంశంపై ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడారు. రైల్వేలైన్ విషయం లో స్థానిక సంస్థల నిర్ణయాన్నీ పరిగణనలోకి తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.