Share News

మ‘రుణాలు’!

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:27 AM

ఆర్థికంగా చితికిపోయి.. తమ చితిని తామే పేర్చుకొని లోకం విడిచి వెళ్లిపోతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఇవాళ అత్యంత ఆందోళన కలిగించే అంశం. అప్పు అనే రెండక్షరాల ఊబి నుంచి బయటపడే అవకాశా లు కానరాక బలవంతంగా ఊపిరి తీసుకుంటు న్నారు.

మ‘రుణాలు’!
తండ్రి కాలువలో తోసేయడంతో మరణించిన చిన్నారి

ఆదాయాన్ని మించి ఖర్చులు

అనవసర ఆడంబరాలు

పెరుగుతున్న అప్పులు

నలిగిపోతున్న జనం

తీర్చలేక బలవన్మరణాలు

కుటుంబాలూ బలి

బ్యాంకు రుణాలు అధికమే

జిల్లాలో రూ.91 వేల కోట్లు

వ్యక్తిగతం రూ.13 వేల కోట్లు

ప్రైవేటు అప్పులు అదనం

(కాకినాడ/రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఆర్థికంగా చితికిపోయి.. తమ చితిని తామే పేర్చుకొని లోకం విడిచి వెళ్లిపోతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఇవాళ అత్యంత ఆందోళన కలిగించే అంశం. అప్పు అనే రెండక్షరాల ఊబి నుంచి బయటపడే అవకాశా లు కానరాక బలవంతంగా ఊపిరి తీసుకుంటు న్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు.. సంపాదనకు ఉన్న వ్యత్యాసం ఉసురుతీస్తోంది. నెలంతా కష్టపడితే ఖాతాలో పడే జీతం మూడు రోజుల్లో ఆవిరి అయిపోతూ.. మా మాటేమిటం టూ 27 రోజులు ప్రశ్నిస్తుండడం నడుమ పేద, మధ్యతరగతి జీవితాలు నలిగిపోతున్నాయి. పిల్ల లను చంపి, తామూ చావడానికి ధైర్యం కూడగ ట్టుకుంటున్నారంటే మరణాలను రుణాలు శాసి స్తున్నాయనే వాస్తవం పదేపదే రుజువు అవు తూనే ఉంది. అప్పులు లేని పేద, మధ్య తరగతి జీవులు భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ కాన రాని రోజులు నడుస్తున్నాయి. ఓ పదేళ్ల కిందట ఆత్మహత్యలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఏ కారణాలు చెప్పుకొన్నా ఆర్థిక ఇబ్బందులే అసలు రుగ్మత అనేది ఏవరూ కాదనలేని వాస్తవం. గతంతో పోలిస్తే ఈరోజు పిల్లల స్కూలు ఫీజుల దగ్గర నుంచి ప్లాట్‌ఫాంపై అమ్మకాలు సాగించే అరటి పండ్లతో సహా సుమారు 200 నుంచి 500 శా తం వరకూ ధరలు పెరిగిపోయాయి. నిత్యావస రాలు అంతే. దీంతో మనుగడకు అప్పులు తప్ప వేరే దారి కానరావడం లేదు. గతంలో కుటుంబ కలహాలు ఎక్కువగా ఉసురుతీస్తే ఇవాళ ఆ స్థా నాన్ని ఆర్థిక ఇబ్బందులు భర్తీ చేస్తున్నాయి. ఒక ప్పుడు ఇల్లు కట్టుకున్నా, కూతురు పెళ్లి చేసినా అప్పులు తప్పవని చెప్పేవారు. ఇవాళ స్కూలు ఫీజు కట్టాలంటే రుణాలకు వెళ్లక తప్పడంలేదు. పోలీసు రికార్డుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది 230 మంది, జనవరిలో 30 మంది, ఫిబ్రవరిలో 20 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అసలు రికార్డులకు ఎక్కనివి ఇంకో అన్ని ఉంటాయని చెబుతున్నారు. ఈ మరణా ల్లో సుమారు 70 శాతం మందిని ఆర్థిక ఇబ్బం దులే చంపేశాయని తెలుస్తోంది. నెలకు రూ.20 వేల నుంచి రూ. 30 వేలు వస్తున్నా నెలాఖరున అప్పులు చేయాల్సిన పరిస్థితి.

అనవసర ఆర్భాటాలతోనూ..

దురాశ.. దుఃఖానికి చేటు అనే విషయాన్ని జనం గుర్తించకపోవడం మరో కారణం. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా.. ఎదుట వ్యక్తి సంపాదించేస్తున్నాడు. మనం కూడా ఏదో ఒక రకంగా సంపాదించాలి. ఖరీదైన బైక్‌లు కొనేయాలి. లగ్జరీ కార్లలో తిరిగేయాలనే అత్యాశకు, అనవసర బిల్డప్‌కు పోయి కొందరు చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి న కొందరు యువత వ్యసనాలకు బానిసవుతున్నారు. బెట్టింగ్‌, ఇతరత్రా జూదక్రీడలకు అల వాటు పడుతున్నారు. వీటిలో సంపాదించింది గోరంతైతే.. పోగొట్టుకునేది కొండంత. స్టాక్‌ మా ర్కెట్లు, షేర్లలో డబ్బులు పెట్టిన వారు ఎందరో నష్టాల బారినపడుతున్నారు. ఇవన్నీ బయటకు చెప్పుకోలేక లోలోపల సతమతవుతున్నారు. చేసి న అప్పులకు వాయిదాలు కట్టలేక కొత్త అప్పులు చేస్తున్నారు. ఇలా అప్పుల మీద అప్పులు చేసి కొందరు చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఆర్థికంగా అగచాట్లు..

కొవిడ్‌ 19 తర్వాత చాలా మంది ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. కొన్నిచోట్ల పరిశ్రమలు మూతపడడం, చాలామంది ఉద్యోగాలు పోవడం.. చేసేందుకు పని కూడా దొరకని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చలేక.. కొత్త అప్పు పుట్టక నానాయాతనపడ్డారు. మరోవైపు ఇదే సమయంలో అప్పులు ఇచ్చే ఫైనాన్షియర్లు కూడా సరైన హామీదారులు ఉంటేనే అదీ కూడా బాగా తెలిసిన వారైతేనే రుణాలు ఇస్తుండడంతో చాలా మంది ఆర్థిక అగచాట్లు పడుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా సిబిల్‌ స్కోర్‌ బా గుంటేనే లోన్లు మంజూరు చేస్తుంటే.. అవీ సరిగా లేని సామాన్యులు నలిగిపోతున్నారు.

అప్పులు తీర్చాలని అర్జీలు

కాకినాడలో ఓ పేద కుటుంబానికి చెందిన ఓ వివాహిత తన కుమార్తె వివాహానికి రెండక్ష రాలున్న ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ వద్ద ఇం టిని తాకట్టు పెట్టి రూ.15 లక్షల రుణం తీ సు కుంది. ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఇం టి జప్తునకు సదరు కంపెనీ నోటీసులు పం పింది. లబోదిబోమన్న ఆమె కంపెనీని వేడుకు న్నా కనికరించలేదు. దీంతో ఈనెల 17న గ్రీవె న్స్‌లో కాకినాడ జిల్లా జేసీని కలిసి ప్రభుత్వం ద్వారా తన అప్పు తీర్చాలని వేడుకుంది. అవా క్కయిన జేసీ, లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులను పిలిచి కొంత సమయం ఇవ్వాలని కోరినా వినకుండా మహిళ ఇంటిని జప్తు చేసేసుకుంది. దీంతో సదరు మహిళ నిలువనీడ కోల్పోయి తీవ్రంగా సతమతమవు తోంది.. ఇలా ఈమే కాదు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది కుటుంబాలు ఆర్థి కంగా చితికిపోయి బతకలేక.. బతుకుబండి ఈడ్చలేక నరకయాతన పడుతున్నాయి. తమ ఆర్థిక భారాన్ని ప్రభుత్వం తీర్చు తుందేమోననే అమాయకపు ఆశతో కొందరు జీవిస్తున్నారు. ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌కు పలు అర్జీలు రావడమే నిదర్శనం. ఈ తరహా విజ ్ఞప్తులు పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ గా వెళ్లడంతో ఆమధ్య డిప్యూటీ సీఎం పవన్‌ సైతం అప్పులు తీర్చాలంటూ జనం విజ్ఞప్తి లేఖలు రాయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బతుకు జీవుడా..!

కాకినాడ రూరల్‌ మండలానికి చెందిన నితీష్‌ మెడికల్‌ రిప్‌గా పనిచేసేవాడు.. వచ్చిన ఆదాయం సరిపోక అక్కడక్కడా అప్పులు చేశా డు.. చివరకు తన ఇంటిపై బ్యాంకులో లోన్‌ పెట్టి చిన్నచిన్న అప్పులు తీర్చేసి.. మిగిలిన సొమ్ముతో మెడికల్‌ బిజినెస్‌ చేశాడు. అయినా లాభంలేదు. ఓ పక్క బాకీదారుల ఒత్తిళ్లు, మరోపక్క పూటగడవని పరిస్థితులు.. కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. తర్వాత తమకున్న ఇంటిని అమ్మితే గట్టెక్కవచ్చని ఆలోచించారు. సొంతింటిని అమ్మేసి అప్పులు తీర్చేశారు. సామర్లకోట మం డలం మాధవపట్నానికి చెందిన నరేంద్ర డిగ్రీ వరకు చదివి ఉద్యోగం కోసం కాకినాడ గాంధీనగర్‌కు చెందిన వెంకటేశ్వరరావుకు అప్పులు చేసి రూ.5 లక్షల వరకు సమర్పించాడు. ఒక సారి ఢిల్లీలో ఇన్‌కంటాక్స్‌ ఆఫీసులో ఉద్యోగం అని.. రెండోసారి రాష్ట్ర రాజధాని అమరావతి సెక్రటేరియేట్‌లో ఉద్యోగం చూశానని మోస గించాడు. ఓపక్క ఉద్యోగం పేరుతో మోసపో వడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి చివరికి పోలీసులను ఆశ్రయించాడు. వీరేకాదు.. ఎంతో మం ది ఆర్థిక పరిస్థితులు తలకిందులై అనేక మంది బతుకు జీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు. కొవిడ్‌ తర్వాత సగటు జీవిబతుకు చిత్రం పూ ర్తిగా మారింది. చాలీచాలని వేతనాలు.. పెరుగుతున్న ధరలు అగాధంలోకి నెట్టేస్తున్నాయి.

ఉమ్మడి జిల్లా బ్యాంకుల్లో రుణాలు రూ.91,089 కోట్లు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది కుటుంబాలు పలు కారణాలతో బ్యాంకుల వద్ద వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. ఇది కాకుండా ఫైనాన్స్‌ కంపెనీలు, బంగారంపై రుణాలు ఇచ్చే సంస్థలు, వ్యాపారులంతా కలిపి ఉమ్మడి జిల్లాలోని అన్ని బ్యాంకుల బ్రాంచిల్లో రూ.91,089 కోట్ల రుణాలు తీసుకున్నాయి. కాకి నాడ జిల్లాలో రూ.33,844 కోట్లు, కోనసీమ జిల్లా లో రూ.23,514 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.33,731 కోట్లు. ఈ మొత్తంలో వ్యక్తిగత రు ణాలు రూ.13 వేల కోట్లు పైనే. పేద, మధ్య తర గతి కుటుంబాలు బ్యాంకుల కంటే తాకట్టు, వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు ఫైనాన్స్‌ల నుంచి తీసు కుంటున్న అప్పులే అధికమని.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని ఆత్మహత్యల వరకు వెళుతున్న అనేక కుటుంబాల గురించి కాకినాడ జిల్లా బ్యాంకింగ్‌ నిపుణులు విశ్లేషించడం గమనార్హం.

ఎందుకు చంపావ్‌ నాన్నా..!

రాయవరం : తన కంటిని తానే ఎవడైనా పొడుకుంటాడా.. ఈయన అదే చేశాడు.. కన్న పిల్లలనే కాలువలో తోసేశాడు..అయితే కుమా ర్తె మృతిచెందగా...కుమారుడు బయటపడ్డాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవాడు. ఎంతో బాగా బతికాడు.. గ్రామంలో అందినకాడికి అప్పులు చేయడంతోపాటు కొంతకాలం కిందట ఇల్లు నిర్మించుకున్నాడు. దీంతో రోటే షన్‌ ఆగిపోయింది.. మరోవైపు అప్పులిచ్చిన వారి ఒత్తిడి పెరిగిపోవడంతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు.. తను చనిపోతే తన పిల్లల పరిస్థితేంటని ఆలోచించాడు. ఈనెల 17న పిల్లలను తీసుకెళ్లి కాలువలో నెట్టేశాడు.. కుమార్తె మృతిచెందగా కుమారుడు బయటప డ్డాడు. చనిపోదామనుకున్నా ధైర్యం సరిపో లేదు. బంధువుల ఇంటికి వెళ్లగా వారు మందలించడంతో పోలీసుల ఎదుట లొంగిపోయా డు. క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం పచ్చని కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. ఏడేళ్లు అల్లారు ముద్దుగా పెంచి ఎందుకు ఆయువు తీశావు నాన్నా.. అంటూ చిన్నారి ఆత్మ ఘోషిస్తోంది.

Updated Date - Mar 23 , 2025 | 12:27 AM