కూటమిలోనూ.. కదలికేది!
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:46 AM
నాడు అంతన్నారు.. ఇంతన్నారు.. పూర్తిచేయకుండా వదిలేశారు.. నాలుగేళ్లయ్యింది.. నేటికీ నిర్మాణంలోనే ఉన్నాయి.. ఇదీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ కళాశాలల తీరు..

తూర్పున కళాశాల ఆరంభం
వసతులు చూస్తే అరకొరే
కోనసీమలో భవనాలే లేవు
నేటికీ పునాది దాటని వైనం
నాలుగేళ్లయినా నేటికీ ఇంతే
వైసీపీ నిర్వాకం..సాగని పనులు
రంగరాయలోనూ వసతుల్లేవ్
10 నెలలైనా పట్టని కూటమి
మెడికల్ విద్యార్థుల ఇక్కట్లు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
నాడు అంతన్నారు.. ఇంతన్నారు.. పూర్తిచేయకుండా వదిలేశారు.. నాలుగేళ్లయ్యింది.. నేటికీ నిర్మాణంలోనే ఉన్నాయి.. ఇదీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ కళాశాలల తీరు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో అయితే భవన నిర్మాణాలు పూర్తికాకుండానే తరగతులు ప్రారంభిం చేశారు.. సౌకర్యాలు చూస్తే అరకొరే.. విద్యార్థులకు ఇబ్బందే.. అయినా పట్టించుకునేవారే లేరు.. కన్నెత్తి చూసేవారు కానరావడంలేదు.. ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అయితే నేటీకి భవన నిర్మాణాలు పునాది దశనూ దాట లేదు..ఎక్కడి పనులు అక్కడే అన్నట్టు ఉన్నాయి.. కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ కళాశాలలోనూ నేటికీ సమస్యలు వెన్నాడుతు న్నాయి.. గత సర్కారులో సరే సరి.. కూటమి ప్రభుత్వంలోనూ కదలికలేకపోవడంపై ‘ఆంధ్రజ్యోతి’ ఫోకస్..గత ప్రభుత్వం ఆర్బాటాలకే కానీ.. వాస్తవ రూపంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించక పో వడం వల్ల మెడికల్ కాలేజీ, కొత్త ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. కూటమి లోనైనా వేగం పుంజుకున్నాయా అంటే అదీ లే దు. సమస్య ఏమిటో కానీ నాడు పనులు ఎలా ఉన్నాయో నేటికీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నా కాంట్రాక్టర్లు వేగంగా పనిచేయడం లేదనే అక్క డి అధికారులే చెప్పడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొత్తం రూ.475 కోట్లతో మెడికల్ కాలేజి, ఆసుపత్రి భవనాలు నిర్మించాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకూ కేవలం రూ.100 కోట్ల పని మాత్రమే జరిగింది. ఏడాదికి 150 మంది విద్యార్థులతో నడుస్తున్న ఈ కాలేజీలో ప్రస్తుతం రెండో బ్యాచ్ నడుస్తోం ది. సెప్టెంబర్‌కు మూడో బ్యాచ్ వస్తుంది. ప్రతి ఏడాది 150 సీట్లలో 110 నుంచి 120 వరకూ అమ్మాయిలే చేరడం గమనార్హం. వారు ఇంత వరకూ హాస్టల్ సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం బాలికలు 360 మందికి, బాలురు 120 మందికి సరిపడా హాస్టల్ కట్టారు.కానీ ఇవి ఇం కా పూర్తిగా అందుబాటులోకి లేదు.అంతే కా కుండా కాలేజీ భవనం పూర్తి కాలేదు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు క్లాసులు పీఈ డీ (నర్సింగ్ విద్యార్థులకు నిర్మించిన) భవ నం లో జరుగుతున్నాయి. మూడో బ్యాచ్ సెప్టెం బరులో రానుంది.అప్పటికి కొత్త కాలేజీ భవనం నిర్మాణం కాకపోతే ఇబ్బందే.కొత్త కాలేజీ భవ నంలో 17 శ్లాబ్‌లకు 15 పూర్తి చేశారు.ఇంకా రెం డు పూర్తి చేయాలి. విద్యార్థులు ఇబ్బంది పడు తున్నారు.ఇక్కడ మెడికల్ కళాశాలకు అనుబం ధంగా 500 పడకల కొత్త బోధనాసుపత్రి నిర్మించాల్సి ఉంది.దానికి భూమిని సిద్ధం చేసినా కదలిక లేదు.ఇప్పటికే పేషెంట్ల సంఖ్య పెరిగిం దని,పుష్కరాల నాటికి బాగా పెరుగుతుందని, అప్పటికి కొత్త ఆసుపత్రి అందుబాటులోకి రావా లని ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభు త్వానికి లేఖ కూడా రాశారు.గత వైసీపీ అసలు కొత్తభవనం గురించి పట్టించుకోలేదు. కూటమి వచ్చిన తర్వాత పాత భవనాలు తొలగించి స్థలా న్ని సిద్ధం చేసినా పనులు ఆరంభంకాలేదు.
కోనసీమలో ఆగిపోయిన పనులు..
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
నాలుగేళ్లు కావొస్తున్నా ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణాలు పునాదుల దశలను దాటలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలోనే పునాదుల్లో ఉన్న భవనాలు, నిర్మాణ సామగ్రి ఉన్నాయి. వందల కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల భవనాల్లో కొన్ని శ్లాబ్‌ల దశలకు చేరుకున్నాయి. ప్రధాన వైద్య కళాశాల భవనం పునాదుల స్థాయికి మాత్రమే పరిమితమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణానికి కూతవేటు దూరం సమనస గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 మే 31న అప్పటి సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాటి నుంచి వైద్య కళాశాల నిర్మాణ పనుల ప్రగతి ‘మిథ్య’గా మారింది. 56 ఎకరాల్లో రూ.475 కోట్లతో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 32 భవనాలు నిర్మించాల్సి ఉన్నా ప్రస్తుతం 17 భవనాలు వివిధ దశల్లో మాత్రమే నిర్మించడానికి కాంట్రాక్టు సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ చర్యలు చేపట్టింది. ప్రధానమైన 750 పడకల ఆస్పత్రి కీలక భవనంతో పాటు ఆరు బ్లాకులతో వైద్య కళాశాల భవనాలు శ్లాబ్‌ల దశకు చేరుకున్నాయి. మిగిలిన బాయ్స్, లేడీస్ హాస్టల్స్ భవనాలు కొన్ని శ్లాబ్‌లు పూర్తయ్యాయి. వివిధ రకాల ల్యాబ్‌లు నిర్మాణ పనులు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. ఈ వైద్య కళాశాల నిర్మాణ పనులు వచ్చే నెల ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నాడు వైసీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కాంట్రాక్టు సంస్థకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే పనులు నత్తనడకన జరగానికి కార ణమని సమాచారం. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావొస్తున్నా వైద్య కళాశాల నిర్మాణ ప్రగతిపై ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం కళాశాల నిర్మాణ పనుల్లో కీలక పాత్ర వహించిన మెగా సంస్థ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాలు, ఇతర సామగ్రిని ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు సమాచారం. మరి ఈ కళాశాల భవనాల నిర్మాణాలు మళ్లీ పునఃప్రారంభమయ్యేది ఎప్పుడో వేచి చూడాల్సిందే.
కాకినాడ రంగరాయలోనూ ఇంతేగా!
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన రం గరాయ మెడికల్ కాలేజీనీ అనేక సమస్యలు వెన్నాడుతున్నాయి.సమర్థవంతమైన వైద్యులను తయారు చేయడంతో పేరొందిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనేక వసతుల లేమితో కొట్టు మిట్టాడుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్భా టంగా అనేక పనులకు టెండర్లు పిలిచి ఆనక నిధులివ్వకపోవడంతో ఇప్పుడవన్నీ వెక్కిరిస్తు న్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో తెలియక ఎదురుచూస్తున్నాయి.ప్రధానంగా మెడికల్ కా లేజీ విద్యార్థులకు సంబంధించి ఏడాదిగా వసతి గృహాల బ్లాకులు కదలకుండా ఆగిపో యాయి.దాదాపు రూ.70 కోట్లతో ప్రారంభించిన రెండు యూజీ, పీజీ వైద్యుల హాస్టల్ బ్లాకుల నిర్మాణం ప్రారంభమైనా నిధుల్లేక పనులకు గ్రహణం పట్టింది. వందల్లో ఉన్న వైద్యవిద్యా ర్థులకు జీప్లస్5, జీప్లస్ 4 విధానంలో రెండు బ్లాకుల నిర్మాణం గతేడాది ప్రారంభం కాగా ప్రస్తుతం జీప్లస్5 బ్లాక్ మొదటి అంతస్తు నిర్మాణ దశలోనే ఉంది. జీప్లస్4 బ్లాక్ అయితే ఇంకా పునాదుల స్థాయి దాటలేదు.వైద్య విద్యా ర్థినులకు సంబంధించి యూజీ, పీజీ వైద్యుల కోసం రూ.100 కోట్లతో జీప్లస్ 5, జీప్లస్ 8 కింద రెండు బ్లాకుల నిర్మాణం ప్రారంభిం చా రు.గతేడాది నుంచీ పనుల్లో కదలికలేదు. నిధు ల్లేకపోవడంతో కాంట్రాక్టర్ అడ్రస్ లేడు. జీజీ హెచ్‌కు ఇన్‌పేషెంట్ రోగుల తాకిడి అధికంగా ఉండ డంతో కొన్నాళ్ల కిందట సూపర్‌స్పె షా లిటీ బ్లాకులను నిర్మించాలని అధికారులు నిర్ణ యించారు.జీజీహెచ్‌కు అనుబంధంగా నర్సింగ్ కాలేజీ, హాస్టల్ నిర్మించాలని భావించి సమీపం లో ఆరెకరాల ప్రభుత్వ భూమి కేటాయించినా పనులు జరగకుండా నిలిచిపోయాయి.