అడ్డంకులు లేకుండా ఆక్రమణలు తొలగించాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:36 AM
అమలాపురంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో నూతన వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు.

అమలాపురం రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో నూతన వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. గురువారం ఈదరపల్లి వంతెన వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వంతెన స్థితిగతులు, రాకపోకలపై ఎమ్మెల్యే ఆనందరావు కలెక్టర్‌కు వివరించారు. వంతెనకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. నూతన వంతెన నిర్మాణానికి అడ్డంకులు లేకుండా ఆక్రమణలు తొలగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వంతెన వద్ద ఉన్న ఆక్రమణల వివరాలను ఆర్డీవో కె.మాధవి, తహశీల్దార్ పలివెల అశోక్‌ప్రసాద్‌లు కలెక్టర్‌కు వివరించారు. ఆక్రమణలను తొలగించిన వెంటనే మేలో నూతన వంతెన నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. అనంతరం నడిపూడి లాకుల వద్ద ట్రాఫిక్ మళ్లింపు కోసం ఎమ్మెల్యే ఆనందరావు ప్రతిపాదించిన నూతన వంతెన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎంపీడీవో ఉండ్రు బాబ్జిరాజు, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు, ఆర్‌అండ్‌బీ డివిజనల్ ఇంజనీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.