Share News

పూర్తయిన పనులకు టెండర్లు పిలవడం ఏమిటి?

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:48 AM

ఎప్పుడో పూర్తిచేసిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలవడం ఏమిటని అధికార పక్ష వైసీపీ కౌన్సిలర్లు సంసాని వెంకటచంద్రశేఖర్‌ ప్రశ్నించారు.

  పూర్తయిన పనులకు టెండర్లు పిలవడం ఏమిటి?

ర్యాటిఫికేషన్‌తో చేయాల్సిన

పనులు కౌన్సిల్‌ మీదకు నెడతారా!

ఐదు టెండర్లు రద్దు

కౌన్సిల్‌ అత్యవసర సమావేశం

అమలాపురం టౌన్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడో పూర్తిచేసిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలవడం ఏమిటని అధికార పక్ష వైసీపీ కౌన్సిలర్లు సంసాని వెంకటచంద్రశేఖర్‌ ప్రశ్నించారు. చైర్‌పర్సన్‌ ర్యాటిఫికేషన్‌తో పూర్తి చేయాల్సిన పనులను కౌన్సిల్‌ మీదకు నెడతారా అని మండిపడ్డారు. అధికారులకు ఉన్న అధికారాన్ని వదిలేసి లక్షలాది రూపాయల పనులను కౌన్సిల్‌పై రుద్దుడం ఏమిటని ప్రశ్నించారు. మొత్తం టెండరు నోటీసులను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టర్ల మధ్య విబేధాలుంటే వారు చూసుకోవాలి అంతేగానీ కౌన్సిల్‌ను బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు కాంట్రాక్టర్లకు మాత్రమే అధికారులు వత్తాసు పలకడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కౌన్సిలర్‌ మట్టపర్తి నాగేంద్ర పేర్కొన్నారు. పూర్తిచేసిన పనులకు సంబంధించి ఎజెండా అంశాలు 116 నుంచి 120 వరకు పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్టు కౌన్సిల్‌ తరపున నాగేంద్ర ప్రకటించారు. అమలాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం 122 ఎజెండా అంశాలతో మంగళవారం చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై అధికార, విపక్ష కౌన్సిలర్లు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుత కౌన్సిల్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుందని, కనీసం కాటన్‌ పార్కును శుభ్రంచేసే పరిస్థితి లేకుండా పోయిందని కౌన్సిలర్‌ బొర్రా వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కుడుపూడి ప్రభాకరరావు పేరిట ఉన్న పార్కులో అభివృద్ధి పనులకు పురపాలక సంఘం తరపున సొమ్ములు కేటాయిస్తున్నారని, ఇంత వరకు ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు పేర్కొన్నారు. ఆట వస్తువుల నుంచి ఎన్నో పాడైపోయాయని, ఎందుకు పనులు చేయడం లేదని, అసలు కాంట్రాక్టరు ఎవరు అని మండిపడ్డారు. 10 వార్డులకు అవసరమైన తాగునీటిని అందించే ఓహెచ్‌ఎస్సార్‌ ట్యాంకును ఎందుకు ప్రారంభించడం లేదని కౌన్సిలర్‌ కొల్లాటి దుర్గాబాయి ప్రశ్నించారు. పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని కౌన్సిలర్‌ యేడిద శ్రీను పేర్కొన్నారు. పారిశుధ్య వర్కర్లకు మేస్ర్తీలు సెలవులు ఇచ్చి వారి వద్ద నుంచి సొమ్ములు గుంజుకుంటున్నారని సంసాని బులినాని ఆరోపించారు. పారిశుధ్య వర్కర్లను సప్లింగ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉందని కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్‌, చిట్టూరి పెదబాబు పేర్కొన్నారు. పురపాలక సంఘంలో 196మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అసలు 30 వార్డుల్లో ఎంతమంది పనిచేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ వద్ద తీసేసిన పైపులు, పాత ఇనుప సామగ్రి తరలించుకుపోతున్నా పట్టించుకోరా అని కౌన్సిలర్‌ చిట్టూరి పెదబాబు ప్రశ్నించారు. అదేవిధంగా ఎలక్ర్టికల్‌ సామగ్రి కూడా మాయమైపోతుందని సమావేశం దృష్టికి సభ్యులు తీసుకురాగా దీనిపై తక్షణం హౌస్‌ కమిటీ వేయాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్‌ చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీ ఎప్పుడు పూర్తవుతుందని సభ్యులు ప్రశ్నించగా రాష్ట్ర వ్యాప్తంగా 500పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గత ప్రభుత్వం వార్డు సచివాలయాల్లోని శానిటరీ సెక్రటరీలను శానిటరీ ఇన్‌స్పెక్టర్లగా కొనసాగించాలన్న విధానాన్ని నేటికీ కొనసాగిస్తున్నామని అధికారులు వివరణ ఇవ్వడం విశేషం. 31శాతం లెస్‌తో టెండర్లు ఎలా ఆమోదిస్తారని కౌన్సిలర్లు తిక్కా సత్యలక్ష్మి, సంసాని బులినానిలు ప్రశ్నించారు. ఎలక్ర్టికల్‌ మెటీరియల్‌ వచ్చిన తరువాత సభ్యులందరికీ చూపించాలని డిమాండ్‌ చేశారు. 10వ వార్డులోని లేఅవుట్‌లో రోడ్డు నిర్మాణానికి కేటాయించిన ఎంపీ ల్యాడ్స్‌ నిధులను ఈ నెలాఖరులోగా ఖర్చుచేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు షార్ట్‌ టెండర్లు పిలవాలని సమావేశం తీర్మానించింది.

లక్షల లక్షలు కేటాయిస్తున్నాం..

అమలాపురం పురపాలక సంఘంలో చెత్తను సేకరించే ట్రాక్టర్లలో ఒక్కటి కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో లేకుండా పోయిందని, ఏటా లక్షల లక్షలు కేటాయిస్తున్నా ఒక్క ట్రాక్టరును కూడా పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేరా అని అధికార విపక్ష కౌన్సిలర్లు అధికారుల తీరుపై మండిపడ్డారు. డ్రైవర్‌ ఒక చేత్తో స్టీరింగ్‌, మరో చేత్తో గొడుగు పట్టుకుని డ్రైవింగ్‌ చేయాల్సిన దుస్థితి ఏమిటని సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను జనసేన, టీడీపీ కౌన్సిలర్లు యేడిద శ్రీను, బొర్రా చిట్టిబాబులు చూపించారు. లక్షల లక్షలు కేటాయిస్తున్నామని, అయితే అధికారులు రూల్‌ పొజిషన్‌ను కాదని వ్యవహరిస్తున్న తీరుపై కౌన్సిలర్‌ నాగేంద్ర మండిపడ్డారు. ట్రాక్టర్లు బాగుచేసే కాంట్రాక్ట పనిని సివిల్‌ కాంట్రాక్టరుకు ఏవిధంగా కట్టబెడతారని మండిపడ్డారు. మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజు మాతృమూర్తి ఇటీవల మృతిచెందగా నిబద్ధతతో సమావేశానికి హాజరైన ఆయన్ను అభినందిస్తూ ఆయన తల్లి మృతికి రెండు నిమిషాలు సభ్యులు, అధికారులు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Updated Date - Mar 19 , 2025 | 12:48 AM