Share News

AP Police: ‘కిడ్నాప్’కు వాడిన కార్లు ఎక్కడివి?

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:58 AM

ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి కిడ్నాప్‌ చేసిన కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాత పాటే పాడారు. తనకు ఏమీ తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇచ్చారు.

AP Police: ‘కిడ్నాప్’కు వాడిన కార్లు ఎక్కడివి?

  • అరెస్టు తర్వాత మీ ఫోన్లు ఎక్కడ?

  • వంశీపై పోలీసుల ప్రశ్నలవర్షం

  • కొన్నింటికే జవాబు ఇచ్చిన వంశీ

  • తిరిగి కస్టడీకి కోరాలని నిర్ణయం

  • ముగిసిన మాజీ ఎమ్మెల్యే విచారణ

  • మూడు రోజుల్లో 71 ప్రశ్నలు

  • అవీ తప్పులేనంటున్న పోలీసులు!

  • తిరిగి కస్టడీకి కోరాలని నిర్ణయం

విజయవాడ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి కిడ్నాప్‌ చేసిన కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాత పాటే పాడారు. తనకు ఏమీ తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇచ్చారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించినా అవే జవాబులు ఇచ్చారు. వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్‌, నిమ్మ లక్ష్మీపతి మూడు రోజుల కస్టడీ గురువారంతో ముగిసింది. చివరిరోజు విచారణలో భాగంగా విచారణాధికారి దామోదర్‌ 16 ప్రశ్నలను వంశీకి సంధించారు. సత్యవర్ధన్‌ను విజయవాడ కోర్టుకు తీసుకురావడం, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లడం, హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు తీసుకెళ్లడానికి ఉపయోగించిన కార్లు ఎవరివని పోలీసులు ప్రశ్నించారు. ఆ కారులతో తనకు ఎలాంటి సంబంఽధం లేదని వంశీ బదులిచ్చారని తెలిసింది. అరెస్టు కావడానికి ముందుదాకా చేతుల్లో ఉన్న ఫోన్లు ఇప్పుడు ఎక్కడున్నాయని అడగగా, ఆయన అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు అని ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. అయితే, ఈసారి దానికి భిన్నంగా... ‘నా ఫోన్లు పోలీసుల వద్దే ఉన్నాయి. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులలో ఒకరికి తన ఫోన్‌ ఇచ్చాను’ అని ఆయన చెప్పినట్టు తెలిసింది. కాగా, మూడు రోజుల విచారణలో పోలీసులు మొత్తం 71 ప్రశ్నలు వేశారు. వాటిలో చాలా తక్కువ ప్రశ్నలకు మాత్రమే ఆయన జవాబులు ఇచ్చాడు. అయితే, ఈ జవాబులూ తప్పులేనని విచారణాధికారులు భావిస్తున్నారు.


విచారణలో మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతి మాత్రం సత్యవర్ధన్‌ ఎపిసోడ్‌కు కర్త, కర్మ, క్రియ వంశీయేనని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ‘మీరు చెబితేనే సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేశా’మని లక్ష్మీపతి అంగీకరించారని వంశీకి చెప్పగా.. లక్ష్మీపతి ఎవరో తనకు తెలియదన్నారు. తాను ఎవరికీ ఎలాంటి ప్రణాళికలు ఇవ్వలేదన్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్నట్టుగా వివిధ సీసీ కెమెరాల ఫుటేజీలను చూపించి ప్రశ్నించినా, వాటితో తనకు సంబంధం లేదని వంశీ జవాబులు చెప్పారు. దీంతో ఆయనను మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పిటిషన్‌ను పటమట పోలీసులు సిద్ధం చేస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత వంశీతోపాటు ఇద్దరు నిందితులను పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ కేసును విచారించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు సెలవులో ఉండడంతో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో వారిని హాజరుపరిచారు. న్యాయాధికారి సత్యానంద్‌ విచారణలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ప్రశ్నించారు. దీనిపై వంశీ స్పందిస్తూ, అర్థంపర్థం లేని ప్రశ్నలు వేసి వేధించారన్నారు. ‘‘జైలులో నన్ను ఒంటరిగా ఉంచుతున్నారు. నాకు ఆస్తమా సమస్య ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఐదు, పదిమంది ఖైదీలు ఉంటే సెల్‌లో పెట్టండి’’ అని కోరారు. ఆయన తరఫున తానికొండ చిరంజీవి, సత్యశ్రీ వాదనలు వినిపించారు. వంశీని భద్రత దృష్ట్యా ప్రత్యేక సెల్‌లో ఉంచామని పీపీ కల్యాణి వాదించారు. వంశీ సెల్‌ వద్ద ప్రత్యేకంగా ఒక వార్డెన్‌ను నియమించాలని ఆదేశించారు. సెల్‌ మార్చాలన్న అంశంపై పిటిషన్‌ను రెగ్యులర్‌ కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచించారు. అనంతరం వంశీని జైలుకు తరలించారు. కాగా, సత్యవర్ధన్‌ కిడ్నా్‌పలో ఘంటా వీర్రాజు(ఏ4), వేలూరి వంశీబాబు (ఏ10)లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వారిని పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.


నా భర్తను ఇబ్బందిపెట్టారు: పంకజశ్రీ

కోర్టు ఇచ్చిన మూడు రోజుల కస్టడీలో పోలీసులు అర్థంపర్థం లేని ప్రశ్నలతో వంశీని ఇబ్బంది పెట్టారని ఆయన సతీమణి పంకజశ్రీ ఆరోపించారు. పోలీసులు ఆయనను విసిగించారని, జైలులో ఆరోగ్యపరమైన సమస్యలతో వంశీ బాధపడుతున్నారన్నారు. కాగా, కోర్టు వద్ద వంశీని ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. భార్య పంకజశ్రీ, కుమారుడు, కుమార్తె ఆయనను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

జగన్‌ను వంశీ కలిశారు: విచారణాధికారి

విచారణలో చాలా ప్రశ్నలకు వంశీ సమాధానాలు చెప్పలేదని విచారణాధికారి దామోదర్‌ చెప్పారు. ‘‘సత్యవర్ధన్‌ను బెదిరించి, భయపెట్టి కేసును తారుమారు చేయాలని చూశారు. వంశీ, ఆయన అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసినట్టు ఆధారాలున్నాయి. ఫోన్‌ గురించి అడిగినా తెలియదన్నారు. ఈ నెల 12న హైదరాబాద్‌ నుంచి వచ్చి మాజీ సీఎం జగన్‌ను కలిసినట్టు వంశీ అంగీకరించారు. మాకు పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మరోసారి వంశీ కస్టడీ కావాలని పిటిషన్‌ వేస్తాం. ఒంటరి బ్యారక్‌లో కాకుండా, అందరితో కలిపి ఉంచాలని ఆయన అడిగారు. కేసులో ఇతర నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేశాం’’ అని దామోదర్‌ తెలిపారు.

Updated Date - Feb 28 , 2025 | 04:58 AM