Amaravathi: వైసీపీ హయాంలో కన్నీళ్లు.. కూటమి ప్రభుత్వంలో ఆనందం..
ABN , Publish Date - Jan 15 , 2025 | 10:22 AM
రాజదాని అమరావతి రైతులు కూటమి ప్రభుత్వం పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగపూట రైతలకు, కౌలు రైతులకు ఇవ్వాల్సిన కౌలు బకాయిలను ఖాతాల్లో జమచేస్తుండటంతో తమకు నిజమైన పండగంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఎంతో ఆవేదన అనుభవింంచారనే విషయం అందరికీ తెలుసు. విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ నూతన రాజధాని నిర్మాణానికి వేలాదిమంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణమే లక్ష్యంగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారు. అమరావతిలో రాజధాని నిర్మాణంపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ సైతం ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణమవుతోందని, తమ భవిష్యత్తు బాగుంటుందని ఆ ప్రాంత వాసులంతా ఆనందించారు. భములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటామని, ల్యాండ్ పూలింగ్‌లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రతి ఏటా కౌలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చింది. దీంతో రాజధాని కోసం ఆనందంతో రైతులంతా తమ భూములను అప్పగించారు.
2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి రాగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరినప్పటినుంచి అమరావతి రాజధాని రైతులకు బ్యాడ్ టైమ్ ప్రారంభమైందనే ప్రచారం జరిగింది. మూడు రాజధానుల పేరిట ఎక్కడా స్థిరమైన రాజధాని నిర్మాణం చేపట్టలేదు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిలిపివేశారు. విశాఖలో రాజధాని అంటూ ఐదేళ్లు కాలక్షేపం చేశారు. మరోవైపు రాజధాని ప్రాంత రైతులు ఐదేళ్లపాటు ఉద్యమాలు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు సక్రమంగా ఇవ్వని పరిస్థితి నెలకొంది. అమరావతి ప్రాంతంలో ఏ రైతును కదిలించినా కన్నీరు పెట్టుకునేవాళ్లు. తమ జీవితాలు బాగుపడతాయని వైసీపీని గెలిపిస్తే.. తమకు సంతోషాన్ని దూరం చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. చివరకు 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీడీపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో రాజధాని ప్రాంత రైతుల కళ్లలో మళ్లీ ఆనందం మొదలైందనే చర్చ జోరుగా సాగింది. తమకు కౌలు ప్రతినెల అందుతుందని, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. పండగపూట సీఎం చంద్రబాబు పాత కౌలు బకాయిలను రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించడంతో సీఆర్‌డీఏ అధికారులు కౌలు బకాయిలను జమచేశారు. దీంతో ఐదేళ్లపాటు కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న ఇంట సంతోషం నెలకొంది.
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులకు సంక్రాంతి కానుక అందించింది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రెండు సంవత్సరాల కౌలు మొత్తాన్ని సోమవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. కొంతమంది రైతులకు 9 వ సంవత్సరం కౌలుతో కలిపి మంగళవారం ఉదయానికే జమ అయినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే పెన్షన్లు కూడా జమ చేసింది ప్రభుత్వం. కాగా, రాజధాని గ్రామాల్లో పింఛన్లు, కౌలు మొత్తాలు చెల్లించేందుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.255 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం నిధులను పూర్తిస్థాయిలో జమ చేసినట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here