HMPV virus: ఏపీలో కొత్త వైరస్ కేసులు.. ఆరోగ్యశాఖ స్పందన ఇదే..
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:42 PM
HMPV virus: హెచ్ఎంపీవీ వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా బయటపడుతాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అన్నారు. హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కన్పిస్తాయని తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎంపీవీ కేసులు ఏం లేవు అని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. ఇప్పటి వరకూ మన భారత దేశంలో కానీ, ఏపీలో కానీ ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవు అని చెప్పారు. ఈ వైరస్ కారణంగా ప్రజలు ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు.
పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే, తాకిన తర్వాత అదే చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకటం ద్వారా మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపిస్తుందని అన్నారు. వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా బయటపడనున్నాయని అన్నారు. హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కన్పిస్తాయని తెలిపారు. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది దారి తీస్తుందని అన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినపుడు, తుమ్మినపుడు, నోటిని, ముక్కును చేతిరుమాలు అడ్డు పెట్టుకోవాలని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, వాడిన వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండటం వంటి చర్యలతో పాటు తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవాలి, తగినంత నిద్ర పోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు.
వైరస్ లక్షణాలు కన్పించిన వారు క్వారంటైన్లో ఉండటం మంచిదని అన్నారు. వైరస్ సోకిన వ్యక్తులు లేదా లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదని, ఉపయోగించిన టవల్స్, రుమాళ్ల వంటి వాటిని మళ్లీ వాడరాదని, చేతులతో తరచూ కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని సూచించారు. అదే విధంగా వైరస్ లక్షణాలున్న వ్యక్తులకు సమీపంగా ఇతరులు ఉండకూడదని అన్నారు. వైరస్ సోకినట్లు అనుమానం ఉన్న వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు. ఇప్పటి వరకూ హెచ్ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స అనేది లేదని తేల్చిచెప్పారు. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ తెరపీ వంటివి ఇవ్వటం జరుగుతుందని స్పష్టం చేశారు. వైరస్ తీవ్రతకు ఎక్కువగా గురయ్యే చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన చికిత్స అందిస్తారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయి
Sankharavam: శంఖారావం సభలో పాల్గొననున్న వీహెచ్పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు..
Renu Desai: తెలుగు సినిమా పరిశ్రమపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
Minister Lokesh: గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్
Read Latest AP News and Telugu News