Share News

Minister Keshav : భారతి సిమెంట్‌ పెట్టుబడులు పెడతామన్నా ఆహ్వానిస్తాం

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:21 AM

ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంవోయూలపై శాసనమండలిలో గురువారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడీగా చర్చ జరిగింది.

Minister Keshav : భారతి సిమెంట్‌ పెట్టుబడులు పెడతామన్నా ఆహ్వానిస్తాం

  • రాష్ట్రాభివృద్ధి.. ఉద్యోగ కల్పనే లక్ష్యం పెట్టుబడిదారులను తరిమేయడం మా విధానం కాదు: పయ్యావుల

  • మీ ప్రభుత్వం వచ్చాకే జిఎస్‌డబ్ల్యూ వెళ్లిపోయింది

  • మా హయాంలో 1 లక్ష 70 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం: బొత్స

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంవోయూలపై శాసనమండలిలో గురువారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడీగా చర్చ జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌.. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి కేశవ్‌ మాట్లాడుతూ దావోస్‌లో మూడు రోజుల్లో 67 కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారన్నారు. సీఎం చర్చించిన వాటిలో ఇప్పటికే మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు వచ్చాయన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చిన వారికి కూటమి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌ వచ్చి భారతి సిమెంట్స్‌ కంపెనీ లేదా మరొకటి పెడతామన్నా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సంస్థలతో అగ్రిమెంట్లు చేయడంతో వదిలేయడంలేదని, పరిశ్రమలు పెట్టి.. ఉద్యోగాలిచ్చే వరకు శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు.


గత ప్రభుత్వంలో అమర్‌ రాజా సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోయిందన్నారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థలేకాదు.. అండర్‌వేర్‌ కంపెనీలను కూడా వేధించడంతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక జేఎ్‌సడబ్ల్యూ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందన్నారు. గత ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలపై చర్చకు తాము సిద్ధమని చెప్పారు. రాష్ట్రం నుంచి జిందాల్‌ ఎందుకు వెళ్లిందో అందరికీ తెలుసన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 05:21 AM