Share News

Ap High Court: మీ చర్యలతో వ్యవస్థపై అపనమ్మకం

ABN , Publish Date - Mar 26 , 2025 | 05:10 AM

పోలీసులు చట్టాన్ని పాటించకుండా కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్‌ మీడియాలో వ్యంగ్య వీడియో పోస్టు చేసిన ప్రేమ్‌కుమార్‌పై దోపిడీ కేసు ఎలా పెట్టారని ప్రశ్నించింది. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు నమ్మకం కోల్పోతారని హెచ్చరించింది.

Ap High Court: మీ చర్యలతో వ్యవస్థపై అపనమ్మకం

వీడియో పోస్టు చేస్తే దోపిడీ కేసు ఎలా పెట్టారు?

కర్నూలు త్రీటౌన్‌ సీఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): కేసుల నమోదు విషయంలో పోలీసులు చట్టనిబంధనలకు లోబడి వ్యవహరించకపోవడాన్ని హైకోర్టు మరోసారి తప్పుబట్టింది. కొందరు పోలీసుల వైఖరితో ఆ వ్యవస్థను నమ్మే పరిస్థితి లేకుండా పోతోందని వ్యాఖ్యానించింది. ‘‘హైకోర్టులో కూర్చునే న్యాయమూర్తులకు వీధుల్లో జరిగే విషయాలు ఏవీ తెలియవని అనుకోవద్దు’’ అని పోలీసులను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యంగంగా విమర్శిస్తూ రికార్డు చేసిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వారిని అరెస్ట్‌ చేసే పనైతే, అలాంటి సినిమాలు తీసే దర్శకులను, అందులో నటించే హీరోలను, విలన్లను కూడా అరెస్టు చేయాలని వ్యాఖ్యానించింది. వ్యంగ్యంగా వీడియో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ప్రేమ్‌కుమార్‌పై దోపిడీ, బలవంతపు వసూళ్ల సెక్షన్ల కింద కేసు ఎలా నమోదు చేస్తారని నిలదీసింది. ఫిర్యాదు అందిన వెంటనే హడావుడిగా కర్నూలు నుంచి వచ్చి గుంటూరులో ఉన్న ప్రేమ్‌కుమార్‌ను తెల్లవారుజామునే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కర్నూలు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌ సీఐని ప్రశ్నించింది. కేసుకి సంబంధించి పూర్తి రికార్డులను తమ ముందు ఉంచాలని సీఐ, సంబంధిత మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Mar 26 , 2025 | 05:10 AM