East Godavari: ఫ్యాన్సీ నంబర్.. ఆర్మీ స్టిక్కర్!
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:45 AM
3333 ఫ్యాన్సీ నంబరుతో కారు.. ముందు, వెనుక అద్దాలపై ఆర్మీ పేరుతో స్టిక్కర్! ఇక మనల్ని ఎవరు అపుతారులే అనే నమ్మకం!! పైగా ఆ కారుకు ముందు కొంత దూరంలో పైలట్‌గా ఒక ఆటో!

కారులో 150 కిలోల గంజాయి
ముందస్తు సమాచారంతో పోలీసుల నిఘా
తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురి అరెస్టు
పట్టుబడ్డ గంజాయి విలువ రూ.30 లక్షలు
రాజమహేంద్రవరం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): 3333 ఫ్యాన్సీ నంబరుతో కారు.. ముందు, వెనుక అద్దాలపై ఆర్మీ పేరుతో స్టిక్కర్! ఇక మనల్ని ఎవరు అపుతారులే అనే నమ్మకం!! పైగా ఆ కారుకు ముందు కొంత దూరంలో పైలట్‌గా ఒక ఆటో! ఏంటి ఇదం తా అనుకుంటున్నారా?? భారీయెత్తున గంజా యి రవాణాకు అక్రమార్కులు వేసిన సినిమా తరహా ప్లాన్ ఇదీ. అయితే వారి ప్లాన్‌ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ముందస్తు సమాచారంతో మాటు వేసి అడ్డుకున్నారు. కారు డిక్కీలోని రూ.30 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని సాఽ్వధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్పీ నరసింహ కిషోర్ వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాజానగరం ఎస్‌ఐ మనోహర్, ఇతర పోలీసు సిబ్బంది మాటు వేశారు. రంపచోడవరం వైపు నుంచి వస్తున్న ఏపీ 39ఏ 3333 నంబరు గల కారులోని వ్యక్తులు పోలీసులను చూసి కంగారుపడ్డారు.
ఆ వెంటనే పోలీసులు కారును చుట్టుముట్టారు. వాహనాన్ని తనిఖీ చేయగా.. కారు డిక్కీలో 2 కిలోల చొప్పున ప్యాకింగ్ చేసిన 75 ప్యాకెట్ల గంజాయి ఉంది. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఎస్పీ చెప్పారు. కారులో ఉన్న ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన షేక్ ఇంతియాజ్, సింగరాయకొండకు చెందిన షేక్ అబ్దుల్ సలీంతో పాటు పైలట్ వాహనంగా వెళ్తున్న ఆటోలోని రంపచోడవరానికి చెందిన సుంకురు బుచ్చిరెడ్డి(బుచ్చి), ముర్ల చిన్నారెడ్డి(జెట్లీ), ఉలుగుల రవికిరణ్ రెడ్డి(పండు)లను అరెస్ట్ చేశామని తెలిపారు. కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనేది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ గంజాయిని తీసుకొస్తున్నట్టు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. కారుపై ఆర్మీ స్టిక్కర్ ఉండడంతో సులువుగా గంజాయి రవాణా చేయవచ్చని నిందితులు భావించినట్లు తెలుస్తోంది. ఓ ఆర్మీ మాజీ ఉద్యోగి తన కారును కిరాయికి ఇస్తుండగా.. నిందితులు దాన్ని తీసుకొని గంజాయి రవాణాకు వినియోగించారని చెబుతున్నారు.