YS Jagan: ఒక్క రోజుతో సరి?
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:29 AM
శాసనసభాపక్ష నేతతో సమానంగా ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని డిమాండ్ చేశారు..

నేడు మాత్రమే సభకు జగన్?
అనర్హత తప్పించుకోవడానికే!!
గవర్నర్ ప్రసంగానికి హాజరు
అంతకుముందు వైసీపీఎల్పీ భేటీ
ఫైర్ ఆఫీసు నుంచి కాలి నడకన అసెంబ్లీ ప్రాంగణంలోకి!
బడ్జెట్ సమావేశాలకు రావడంపై స్పష్టత ఇవ్వని ముఖ్య నేతలు
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు హాజరవుతానని ప్రకటించారు.. అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలని సవాల్ విసిరారు.. శాసనసభాపక్ష నేతతో సమానంగా ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని డిమాండ్ చేశారు.. వీటిలో ఏ ఒక్కటీ జరిగే అవకాశం లేదని తెలిసినా.. ఇప్పుడు సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వాలని వైసీపీ పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అయితే తొలిరోజు గవర్నర్ ఉభయసభనుద్దేశించి చేసే ప్రసంగానికి మాత్రమే హాజరవుతానని ముందే ప్రకటించారు. ప్రసంగం పూర్తయ్యేంత వరకు సభలోనే ఉంటారా.. మధ్యలోనే వెళ్లిపోతారో వైసీపీ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. మంగళవారం కడపకు వెళ్తారని మాత్రం ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అంటే మొదటి రోజు మాత్రమే వచ్చి ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉంటారని అవగతమవుతోంది. వరుసగా ఆరు నెలలు హాజరు కాని సభ్యులపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. అది తప్పించుకోవడానికే ఆయన, ఎమ్మెల్యేలు ఒకరోజు సభకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం తాడేపల్లి ప్యాలెస్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అవుతారు. సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం వారితో కలిసి అసెంబ్లీ ఫైర్ ఆఫీసు వరకు వాహనాల్లో వస్తారు. అక్కడి నుంచి కాలినడకన నాలుగో గేటు గుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి పెడతారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అలాగే బడ్జెట్ సమావేశాలకు జగన్ కూడా వస్తారా.. ఎమ్మెల్యేలను మాత్రమే పంపుతారా.. లేదంటే అందరూ మూకుమ్మడిగా డుమ్మా కొడతారా అనేదానిపై ముఖ్య నేతలు స్పష్టత ఇవ్వడం లేదు.