Share News

శేషారెడ్డిపల్లెలో తాగునీటి కష్టాలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:12 AM

జమ్మలమడుగు మండలంలోని శేషారెడ్డిపల్లె గ్రామం (రాళ్లగుండ్లకుంట)లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

శేషారెడ్డిపల్లెలో తాగునీటి కష్టాలు
బావి నుంచి నీళ్లను చేదుతున్న గ్రామస్థులు

జమ్మలమడుగు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు మండలంలోని శేషారెడ్డిపల్లె గ్రామం (రాళ్లగుండ్లకుంట)లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మూడు రోజుల నుంచి గ్రామంలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్కరు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. శేషారెడ్డిపల్లె గ్రామంలో మూడు రోజుల నుంచి కరెంటులేక బోరు పని చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని స్థానికులు తెలిపారు. గ్రామంలో విద్యుత్తు లేక తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామ స్థులు వాపోతున్నారు. తాగునీటి కోసం చేసేది లేక గ్రామ శివార్లలో పైపుల లీకేజీ గుంతల వద్ద నిలిచిన నీటిని బిందెలకు తోడి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి నీరుతాగితే రోగాలు వస్తే ఎవరు కాపాడుతారని పేర్కొంటు న్నారు. మరికొందరు పురాతన బావిలో నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు శేషారెడ్డిపల్లె వద్ద నుంచి సుమారు అయిదు కిలోమీటర్ల దూరం పట్టణంలోకి ప్రవేశించి ఫిల్టర్‌వాటర్‌ స్కూటర్‌లో తెచ్చుకుంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యకు సంబందించి శేషారెడ్డిపల్లె గ్రామ సర్పంచ్‌ అధికారుల వద్దకు వెళ్లి సమస్య తెలిపినా అధికారులు రాలేదని గ్రామస్థులు చెప్పారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

విద్యుత సమస్య కాదు

కాగా శేషారెడ్డిపల్లెలో విద్యుత సమస్య వల్ల తాగునీటి సమస్య కాదని విద్యుత రూరల్‌ ఏఈ ఈశ్వరయ్య తెలిపారు. గ్రామంలో మోటారు సమస్య వల్లే నీటి సమస్య ఉండి ఉండవచ్చని ఆయన అన్నారు. నీటి సమస్యపై ఏఈని ఆంధ్ర జ్యోతి వివరణ కోరగా పైవిధంగా స్పందించారు.

Updated Date - Mar 26 , 2025 | 12:12 AM