బీసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:09 AM
బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి పరిష్కరించాలని జమ్మలమడుగు నియోజకవర్గ బీసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

జమ్మలమడుగు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి పరిష్కరించాలని జమ్మలమడుగు నియోజకవర్గ బీసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆమేర కు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు జొల్లు కొండయ్య, తదితర నాయకులు ఆర్డీవో సాయిశ్రీకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ జనాభాలో 50 శాతంపైగా బీసీలు, 60 శాతం బీసీ ఉపకులాలు ఉండగా వారిలో 70 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారన్నారు. చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండే విధంగా శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కాట రామదాసు, కోశాధికారి వెంకోబారావు, వాల్మీకి సంఘం నాయకులు పెద్ద కంబయ్య పాల్గొన్నారు. కాగాఈ మైలవరం మండలం చిన్నవెంతుర్ల గ్రామంలో పీర్లమాన్యం ఇనాం భూమి 4.70 ఎకరాలు కబ్జా చేశారని గూడుబాయిగారి చిన్నమౌలాలి అందజేసిన వినతిపత్రంలో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా జమ్మలమడుగు తహసీల్దారు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారని తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సైదున్నీసా, ఉపాధి హామీ అధికారిణి పద్మ అధికారులు పాల్గొన్నారు.