మట్టితరలింపును అడ్డుకుని చెరువును కాపాడండి
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:52 PM
మట్టి తరలింపును అడ్డుకుని నాగసానిపల్లి చెరువును కాపాడాలంటూ సుగాలితాండా కాలనీవాసులు డిమాండ్ చేశారు.

ధర్నాలో సుగాలితాండా కాలనీ వాసులు
ఖాజీపేట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మట్టి తరలింపును అడ్డుకుని నాగసానిపల్లి చెరువును కాపాడాలంటూ సుగాలితాండా కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఆమేర కు ఆదివారం రోడ్డుకు అడ్డంగా మట్టిని వేసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ చెరువులో ఇష్టానుసారంగా 10 మీటర్లలోతు తవ్వి మట్టిని తరలించి చెరువును నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తద్వారా చెరువు కింద భూములు నీరు లేక బీడుగా వదలుకోవాల్సి వస్తోందని వాపోయారు. వెంటనే ఉన్నతాధికారులు కలుగజేసుకుని మాకున్యాయం చేయాలని కాలనీ వాసులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి అక్కడి నుంచి వారిని పంపించి వేశారు. కాగా ఈ సంఘటనపై సీఐ మోహన్‌ను వివరణ కోరగా హైవేవారికి పర్మిషన్ ఉందని, అయితే గ్రామస్థులు మాత్రం అడ్డుకుంటున్నారన్నారు. దీంతో గ్రామస్థులకు చెప్పి అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి యథావిదిగా తోలేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే ఉన్నతాధికారుల ద ృష్టికి వెళ్లి పరిష్కరించుకోవాలని, మరోసారి అడ్డుకుంటే కేసు నమోదు చేస్తామన్నారు.