Share News

Mining Department Investigation: కాకాణిపై కేసు

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:17 AM

నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్‌ మైనింగ్‌ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఇతరులపై కేసు నమోదైంది. మొత్తం 10 మంది పై కేసు నమోదు చేసి 7 మందిని అరెస్టు చేసి రిమాండ్‌ విధించారు

Mining Department Investigation: కాకాణిపై కేసు
Kakani Govardhan Reddy

  • రూ.250 కోట్ల క్వార్ట్జ్‌దోపిడీలో ఆయనతో పాటు ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌

  • ఇద్దరు అరెస్టు.. 14 రోజుల రిమాండ్‌

  • ఏ4గా మాజీ మంత్రి.. అరెస్ట్‌ చేసే చాన్స్‌

  • నెల్లూరు జిల్లా రుస్తుం మైన్స్‌లో దోపిడీ

నెల్లూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ4గా చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదివరకే ముగ్గురిపై కేసు పెట్టగా, తాజాగా సోమవారం కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏ6, ఏ8గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకాణితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని క్వార్డ్జ్‌ నిక్షేపాలన్నింటినీ నెల్లూరుకు చెందిన ఒక మాజీ మంత్రికి అప్పగించారు. ఈ క్రమంలో అందుకు సమాంతరంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ క్వార్డ్జ్‌ తవ్వకాలు జరిగాయి. రుస్తుం మైన్స్‌ నుంచి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద కొల్లగొట్టారు. రుస్తుం మైన్స్‌ను గతంలో ఒకరికి లీజుకు ఇచ్చారు. ఆ లీజు గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఈ మైన్‌పై కన్నేశారు. పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌ చేశారు. ఈ ముఠా వెనుక అప్పటి మంత్రి కాకాణి హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్‌ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.


వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించిన సోమిరెడ్డి కేంద్ర మైనింగ్‌ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాలకు తోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుకు ప్రాణం వచ్చింది. అప్పటి వరకు ఆ క్వారీ వైపు కన్నెత్తి కూడా చూడని మైనింగ్‌ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి దోచుకుపోయిన క్వార్డ్జ్‌ విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు కట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొదట ముగ్గురిపై కేసు కట్టారు. వీరిలో కాకాణికి కుడిభుజమైన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి పేర్లతో తొలుత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఈ ముగ్గురు పోలీసులు తమ వద్దకు రాకముందే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. తాజాగా మరో ఏడుగురిని ఈ కేసులో చేర్చారు.

కాకాణి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ప్రస్తుత పరిణామాలను గమనిస్తే మాజీ మంత్రి కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకాణికి కష్టకాలం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 07:52 AM