మీరు రోజూ గోల్డెన్ రైస్ ఆరగిస్తున్నారా.. అయితే ఒక్కసారి..
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:37 AM
మీరు గోల్డెన్ రైస్ తింటున్నారా.. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. ఈ బియ్యంలో విటమిన్ ఏ లేదా బీటా కెరోటీన్ అధికంగా లభించేట్టు శాస్త్రవేత్తలు తయారు చేశారు.

ఇటీవల గోల్డెన్ రైస్, ఫార్టీఫైడ్ రైస్ గురించి వింటున్నాం. వీటిలో పోషకాలేమిటి? మధుమేహం ఉన్నవారికి ఏదైనా ప్రత్యేకమైన రకం బియ్యం వాడితే మంచిదా?
- జనార్దన్ మెట్టు, నారాయణగూడ
మామూలు వరిలో కొన్ని జన్యుపరమైన మార్పులను చేయడం ద్వారా ఆ రకమైన వరిని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఈ బియ్యంలో విటమిన్ ఏ లేదా బీటా కెరోటీన్ అధికంగా లభించేట్టు శాస్త్రవేత్తలు తయారు చేశారు. బీటా కెరోటీన్ వల్ల బియ్యానికి బంగారు రంగు వస్తోంది. అందుకే దీన్ని గోల్డెన్ రైస్ అంటున్నారు. ఫార్టీఫైడ్ రైస్ లో ... ఐరన్, బీ విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ లాంటి కొన్ని ఆవశ్యక పోషకాలను బియ్యానికి చేరుస్తారు. ఇలా పోషకాలను చేర్చడం వల్ల బియ్యమే ప్రధానాహారంగా ఉన్నవారిలో పోషకాల లోపం ఎదుర్కొనేందుకు చక్కటి అవకాశం ఇది. ఈ మధ్య కాలంలో మార్కెట్లో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ రైస్ అనే రకం కూడా పలు బ్రాండ్‌లలో అందుబాటులో ఉంది. దీనిలో ఉండే పిండి పదార్థాల రసాయన నిర్మాణంలో తేడాల వల్ల మామూలు బియ్యంతో పోలిస్తే ఈ రకం బియ్యం వాడినప్పుడు రక్తంలో చక్కర నియంత్రణ మెరుగ్గా ఉంటోంది. అందుకే మధుమేహం ఉన్నవారు మామూలు రకాలకు బదులు ఈ తక్కువ జిఐ బియ్యం వాడితే ఉపయోగం ఉంటుంది. కానీ ఈ రకం బియ్యంలో కూడా క్యాలరీలు అదే పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఇదైనా మితంగానే తీసుకోవాలి.
పాలు, పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలుగా రకరకాల గింజల నుంచి చేసిన సోయామిల్క్, ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లాంటివి అందుబాటులో ఉంటున్నాయి. కాఫీ టీలలో వీటిని వాడవచ్చా? వీటి వాడకం వల్ల ఏవైనా ప్రత్యేకమైన లాభాలు కానీ నష్టాలు కానీ ఉన్నాయా?
- మానస, విశాఖ
పాలనుంచి మనకు అందే పోషకాల్లో ప్రొటీన్లు, క్యాల్షియం ముఖ్యమైనవి. పాల ప్రత్యామ్నాయాలుగా అందుబాటులో ఉంటున్న సోయా మిల్క్, ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ వంటి వాటిల్లో కేవలం సోయా మిల్క్‌లో మాత్రమే కొద్ది పాటి ప్రొటీన్, క్యాల్షియం ఉంటాయి. ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్‌లలో స్వతహాగా ఈ పోషకాల పరిమాణం తక్కువే. కానీ, లాక్టోజ్ ఇంటాలరెన్స్, పాలవల్ల ఎలర్జీ ఉన్నవారికి ఈ ప్రత్యామ్నాయాలు ఉపయోగపడతాయి. కాఫీ టీలలో పాలకు బదులుగా వీటిని వాడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఇలా కాఫీ, టీలు తీసుకునేప్పుడు క్యాలరీలు పరిమితిలో ఉండాలంటే వాటిలో చక్కెర, బెల్లం లాంటి తీపి పదార్థాలు చేర్చకపోవడం మేలు. ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్‌లో క్యాలరీలు మామూలు పాల లాగానే ఉన్నప్పటికీ ప్రొటీన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పాలకు బదులు ఇవి వాడుతున్నట్టయితే మిగతా ఆహారంలో తప్పనిసరిగా ప్రొటీన్, క్యాల్షియం ఇచ్చే పదార్థాలు ఉండేలా జాగ్రత్తపడాలి.
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో భోజనాల తరువాత తాంబూలం తప్పనిసరి. ఇలా కిళ్లీ తీసుకోవడం వల్ల ఏవైనా ఉపయోగాలున్నాయా? డయాబెటీస్ ఉన్నవారు తాంబూలం తినవచ్చా?
- మురళీకృష్ణ, హన్మకొండ
తాంబూలం అరుగుదలకు కాస్త ఉపయోగ పడుతుంది. తమలపాకులో ఉండే డయాస్టేస్, క్యాటలేజ్ అనే ఎంజైములు అరుగుదలకు ఉప యోగపడతాయి. తమలపాకులో పీచుపదార్థం, బీటా కెరోటీన్, పొటాషియం, కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. తాంబూలంలోని వక్కలో ఆల్కలాయిడ్లు అనే పదార్థాలు ఉత్తేజాన్ని పెంచి, కడుపు నిండా భోంచేసిన తరువాత వచ్చే నిద్రను నియంత్రిస్తాయి. కానీ అధిక మొత్తంలో లేదా తరచూ వక్క లేదా వక్కపొడి తీసుకోవడం వలన నోటిలోని కణజాలం దెబ్బతిని నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాన్‌లో వాడే సున్నం వల్ల కూడా నోటి కణజాలం దెబ్బతింటుంది. ఇంకా దీర్ఘకాలంలో ఆస్తమా రావడం, జీర్ణశక్తి తగ్గడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. స్వీట్ పాన్‌లో వాడే తీపి పదార్థం వల్ల క్యాలరీలు, పిండి పదార్ధాలు కూడా చేరుతాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా తరచూ కిళ్లీ తీసుకోక పోవడమే మేలు. కేవలం ఆరోగ్యం కోసమే అయితే అప్పుడప్పుడూ తమలపాకు వరకూ తీసుకోవచ్చు.