Share News

అసమ్మతికే ఓటు

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:05 AM

తిరువూరు మునిసిపాలిటీలో కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు బుధవారం తెరపడింది. సొంత పార్టీ కౌన్సిలర్లను కాపాడుకోవటానికి వైసీపీ అధినేత జగన్‌ అసమ్మతివాదులకే ఓటేశారు. ప్రస్తుత చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించగా, ఆమె బాధాతప్త హృదయంతో అంగీకారం తెలిపారు. దీంతో అసమ్మతి వర్గమే విజయం సాధించినట్టైంది.

అసమ్మతికే ఓటు
వైసీపీ అధినేత జగన్‌తో చైర్‌పర్సన్‌ అభ్యర్థి మోదుగు ప్రసాద్‌

తిరువూరు మునిసిపాలిటీలో సద్దుమణిగిన వివాదం

15 మంది వైసీపీ కౌన్సిలర్లతో అధినేత జగన్‌ భేటీ

అసమ్మతి వర్గానికే ఓటు వేస్తూ నిర్ణయం

ప్రస్తుత చైర్‌పర్సన్‌ రాజీనామా చేయాలని ఆదేశం

కొత్త చైర్మన్‌గా మోదుగు ప్రసాద్‌ ఎంపిక

అసమ్మతివాదులు టీడీపీవైపు మళ్లకుండా ఉండేందుకే..

తిరువూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : పక్షం రోజులుగా తిరువూరు మునిసిపాలిటీలో జరుగుతున్న అధికారపక్ష అసమ్మతి పోరుకు సంబంధించి బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆఽధ్వర్యంలోని 15 మంది వైసీపీ కౌన్సిలర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుత చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయిని గద్దె దింపి తమకు అవకాశం కల్పించాలని అసమ్మతి నేత మోదుగు ప్రసాద్‌ జగన్‌ వద్ద ప్రతిపాదన చేశారు. అయితే, అసమ్మతివాదులు ఎక్కడ టీడీపీవైపు మళ్లుతారోనని జగన్‌ వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్‌పర్సన్‌ రాజీనామాకు ఆదేశించారు. అయితే, ఆమె జగన్‌ దగ్గర అంగీకరించినప్పటికీ బాధాతప్త హృదయంతోనే కనిపించారు. అసమ్మతిని అణచివేయాల్సింది పోయి, వారికి మద్దతుగా నిలవటంపై ఆమె సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే, తాను తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మునిసిపాలిటీని కోల్పోవాల్సి వస్తుందని జగన్‌ హెచ్చరించారు.

ఆది నుంచీ వివాదమే..

మునిసిపల్‌ బోర్డు వైసీపీ కైవసమైన నాటి నుంచి చైర్‌పర్సన్‌ విషయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం బోర్డు ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి ఒప్పందం అమలు చేయాలని మోదుగు ప్రసాద్‌ ఆధ్వర్యంలోని కొందరు సభ్యులు అవిశ్వాసం బాట పట్టారు. సమస్యను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా సద్దుమణగలేదు. ఈ తరుణంలో పంచాయితీని తాడేపల్లికి మార్చారు. పార్టీ అధ్యక్షుడి సూచనతో చైర్‌పర్సన్‌గా మోదుగు ప్రసాద్‌ ఎంపికయ్యారు.

తెరపైకి వైస్‌ చైర్‌పర్సన్‌ వివాదం

ప్రస్తుతం తిరువూరు మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ వివాదం సద్దుమణిగిందనుకునే తరుణంలో వైస్‌ చైర్‌పర్సన్‌ వివాదం తెరపైకి వచ్చింది. నాటి ఒప్పందాన్ని అనుసరించి ప్రస్తుత చైర్‌పర్సన్‌ రాజీనామా చేస్తే, వైస్‌ చైర్‌పర్సన్లు కూడా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను కొందరు సభ్యులు అఽధ్యక్షుడి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుత వైస్‌ చైర్‌పర్సన్లు తప్పుకొంటే, కొత్తవారిని ఎన్నుకోవాలని అధ్యక్షుడు జగన్‌ సూచించగా, ఒక కౌన్సిలర్‌ తనకు వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి కావాలంటూ ప్రతిపాదన చేశారు. ఇప్పటికే చైర్‌పర్సన్‌ మార్పు పార్టీకి ఏం ప్రమాదం తెస్తుందో అనే ఆందోళనలో ఉన్న కొందరు నాయకులు.. ప్రస్తుతానికి వైస్‌ చైర్‌పర్సన్ల ఎంపికను వాయిదా వేసుకుందామని, పరిస్థితులు చక్కబడితే అప్పుడు వైస్‌ చైర్‌పర్సన్ల ఎంపికపై దృష్టి పెడతామని చెప్పినట్లు సమాచారం.

Updated Date - Mar 20 , 2025 | 01:05 AM