అనుమతిస్తే అవాంతరాలు తొలగినట్లే
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:42 PM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి 30 రోజులు పూర్తయ్యింది. ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. చిక్కుకున్న మొత్తం కార్మికుల ఆచూకీ లభ్యం అయ్యే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడం డీబీఎంతోనే సాధ్యమని తేటతెల్లం
ప్రభుత్వ ప్రత్యామ్నాయ ప్రణాళికను ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
అప్పట్లో బ్లాస్టింగ్‌కు అనుమతి లేకపోవడంతోనే టీబీఎంతో తవ్వకం
టన్నెల్ మొత్తం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఉండటంతోనే సమస్య
పాత అనుమతులను సమీక్షించి కొత్తగా తీసుకోవడం తేలికేమీ కాదు
టిప్పర్లు, యంత్రాలు తిరగడానికి షాప్ట్ తవ్వకం ప్రధానంగా అవసరం
మహబూబ్‌నగర్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి 30 రోజులు పూర్తయ్యింది. ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. చిక్కుకున్న మొత్తం కార్మికుల ఆచూకీ లభ్యం అయ్యే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే టన్నెల్ పూర్తి చేయడాన్ని కూడా సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికపై కూడా దృష్టి సారించింది. సోమవారం సీఎంతో జరిగిన సమీక్ష సందర్భంగా టన్నెల్‌ను పూర్తిచేయాలంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమయ్యే అనుమతులు కూడా తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత టన్నెల్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే డీబీఎం పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నట్లు వివరాలు వెల్లడించింది. భవిష్యత్‌లో అదే నిజం కాబోతోంది. ఇప్పటికే తవ్వకం ప్రారంభించి 18 ఏళ్లు పూర్తికాగా త్వరితగతిన పూర్తిచేయడానికి డీబీఎం పద్ధతి మేలనే అభిప్రాయాన్ని నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకురావడం అంత తేలికేమీ కాదని కూడా అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు అటవీ అనుమతులు రాకనో, పర్యావరణ ప్రేమికులు కేసులు వేయడం ద్వారానో ముం దుకు సాగడం లేదు. దీని విషయంలో కూడా అది జరగకుండా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటవీ అనుమతులు తొలగినట్లయితే చాలా వేగంగా మిగిలిన దూరాన్ని డీబీఎం ద్వారా పూర్తిచేసే అవకాశం ఉంది.
టైగర్ రిజర్వ్‌తోనే సమస్య...
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇన్‌లెట్ (దోమలపెంట), ఔట్‌లెట్ (మన్నెవారిపల్లి) మధ్య మొత్తం 43 కిలోమీటర్ల దూరం ఈ ప్రాంతం మొత్తం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నది. ఇన్‌లెట్ వైపు నుంచి 13.936 కిలోమీటర్లు, ఔట్ లెట్‌వైపు 8 నుంచి 20.436 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయ్యింది. మరో 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇన్‌లెట్ వైపు నుంచి పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీబీఎం మొ త్తం ధ్వంసమై పనిచేసే అవకాశం వందశాతం లేనట్లే. దాన్ని ముక్కలుగా చేసి మరీ సహాయక చర్యలు చేపడుతున్నారు. కొత్త టీబీఎం లోపలికి పంపించే అవకాశం కూడా లేదు. టీ బీఎం డయా 10 మీటర్లు కాగా సెగ్మెంట్ బ్లాకులు పెట్టిన తర్వాత 9.25 మీటర్ల డయా అవుతుంది. అలాగే పంప్ స్టేషన్లు, కన్వేయర్ బె ల్టులు, లోకో ట్రాక్‌లు కూ డా ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యమయ్యే పనికాదు. మన్నెవారి పల్లి నుంచి వస్తున్న టీబీఎం ఇప్పటికే 20 కిలోమీటర్లు దాటింది. ఇంకా 3 కిలోమీటర్లు తవ్వితే దాని టార్గెట్ చేరుకుంటుంది. ఇప్పుడు అది కూడా బేరింగ్ పోయి మరమ్మతులో ఉన్నది. అక్కడి నుంచి టన్నెల్ పూర్తిచేయాలని అనుకున్నా షీర్ జోన్ వస్తే మరింత ప్రమాదమే అవుతుంది. ఇప్పుడు మిగిలిన దూరం బైపాస్ లా పూర్తిచేయాలంటే డీబీఎం అవసరం అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభంలోనే టైగర్ రిజర్వ్ కావడం వల్ల బ్లాస్టింగ్‌కు అనుమతులు లభించలేదు. అందుకే టీబీఎంతో తవ్వకం చేపట్టారు. ఇప్పుడు కూడా అదే అడ్డంకిగా మారనుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచిచూడాలి. ఈ ప్రాజెక్టు 2005 ఆగస్టు 11న రూ. 2813 కోట్ల నిర్మాణ అంచనాలతో చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వగా రూ. 2259 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లు అయ్యాయి. 9 శాతం తక్కువకు రూ. 1925 కోట్లతో జేపీ అసోసియేట్స్ పనులు దక్కించుకొని ఇప్పటివరకు రూ. 2689 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత అంచనాలు రూ. 4637 కోట్ల వరకు సవరించారు.
ప్రత్యామ్నాయం ఫైనల్ అయినట్లేనా?
సీఎంతో సమావేశంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిపై సూత్రప్రాయంగా నిర్ణయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే గతంలో జేపీ అసోసియేట్స్ ప్రతిపాదించిన ప్రణాళికనే ఫైనల్ చేస్తారా, లేక మరో ప్రణాళిక ఏదైనా సిద్ధం చేస్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం ప్రస్తుత ప్రమాదం 13.900 కిలోమీటర్ల వద్ద జరగ్గా 13.500 కిలోమీటరు వరకు బాగానే ఉన్నది. అక్కడి నుంచి 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు (జీఎ్‌సఐ సూచనల ప్రకారం) కుడివైపునకు తిరిగి పాత లెవల్‌ను కొనసాగిస్తూ 20వ కిలోమీటర్ వద్ద పాత అలైన్‌మెంట్‌కు టన్నెల్‌ను కలుపనున్నారు. ఇప్పటికే ఔట్‌లెట్ టన్నెల్‌వైపు 20.435 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తయ్యింది. పాత డిజైన్ ప్రకారం ఇంకో 3.545 కిలోమీటర్లు తవ్వాలి. కానీ, టీబీఎం చెడిపోవడంతో పనులు అటువైపు కూడా ఆగిపోయాయి. బేరింగ్ రావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ఔట్‌లెట్ టన్నెల్ తవ్వకం అక్కడికే నిలిపివేసి ఇన్‌లెట్ నుంచి పక్కకు జరిగి 13.500 కిలోమీటర్ల నుంచి 20వ కిలోమీటర్ వరకు డీబీఎం పద్ధతిలో టన్నెల్‌ను తవ్వుతారు. దీనివల్ల సమయం తక్కువగానే పట్టి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తికి దీనికి మించిన ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, జీఎ్‌సఐ సూచనల ప్రకారమే చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం టన్నెల్ డయా 9.25 మీటర్లు సర్క్యులర్ షేప్‌లో ఉండగా అది 10 మీటర్లకు షూ షేప్ సైజ్‌గా మార్చనున్నారు. అయితే ఈ పద్ధతిలో పనులు చేయాలంటే కచ్చితంగా అటవీ అనుమతులను త్వరితగతిన సాఽధించాల్సి ఉంది.