పాల రైతులకు విజయ డెయిరీ మూడో విడత రూ.18 కోట్ల బోనస్
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:51 AM
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) పాల రైతులకు మూడో విడత రూ.18 కోట్ల బోనస్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాల రైతులకు బోనస్‌ను ప్రకటించడం ఇది మూడోసారి. ఆగస్టులో రూ.18 కోట్లు, డిసెంబరులో రూ.14 కోట్ల బోనస్‌ను ప్రకటించారు.

పాల రైతులకు విజయ డెయిరీ మూడో విడత రూ.18 కోట్ల బోనస్
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల టర్నోవర్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,350 కోట్లు లక్ష్యం
పాలకవర్గ సమావేశంలో చైర్మన్ చలసాని ఆంజనేయులు
చిట్టినగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) పాల రైతులకు మూడో విడత రూ.18 కోట్ల బోనస్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాల రైతులకు బోనస్‌ను ప్రకటించడం ఇది మూడోసారి. ఆగస్టులో రూ.18 కోట్లు, డిసెంబరులో రూ.14 కోట్ల బోనస్‌ను ప్రకటించారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులో రూ.1,200 కోట్ల మేర టర్నోవర్‌ను సాధించారు. ఈ క్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,350 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గురువారం చిట్టినగర్‌లోని కృష్ణామిల్క్ యూనియన్‌లో పాలకవర్గ సమావేశం జరిగింది. చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ బోనస్ చెల్లింపుతో పాటు అధిక ధర చెల్లించడంలో కృష్ణా మిల్క్ యూనియన్ దేశంలోనే ముందువరసలో ఉందన్నారు. పాడి రైతులు, వినియోగదారులు రెండు కళ్లుగా పని చేస్తోందని, 72 రకాల పరీక్షలు చేసిన తర్వాత వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పాల పదార్థాలు అందిస్తోందని చెప్పారు. మూడో విడత బోనస్ ఏప్రిల్‌లో రూ.18 కోట్లు పంపిణీ చేస్తామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల బోనస్‌ను మూడు విడతలుగా పాడి రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. పాల సేకరణ ధర, బోనస్‌తో కలిపి సమితి పాడి రైతులకు కేజీ ప్యాట్‌కు రూ.902 చెల్లిస్తోందని, ఇది దేశంలోనే అత్యధిక ధర అన్నారు. నాణ్యమైన పశువైద్యం, సబ్సిడీపై పశుదాణా, పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు మేలు జాతి వీర్యాన్ని రూ.3 కోట్లు ఖర్చుచేసి పాడి రైతులకు సబ్సిడీపై ఈ ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేశామన్నారు. పాడి పశువుల షెడ్ల ఏర్పాటుకు, పశుగ్రాస అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక తోడ్పాటు ఎంతో ఆనందకరమంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
వరదల్లోనూ ‘కామధేను’ కార్యకలాపాలు
బుడమేరు వరద ముంపు సమయంలో 42 రోజులు విజయవాడ ఫ్యాక్టరీ మూతపడి రూ.24 కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ ముందుచూపుతో నిర్మించిన కామధేను ఫ్యాక్టరీ కారణంగా, పాడి రైతులు, సమితి సిబ్బంది, వినియోగదారుల సహకారంతో రోజువారీ నిర్వహణలో ఎటువంటి ఆటంకం లేకుండా కార్యకలాపాలు సాగించామన్నారు. డాక్టర్ వర్గీస్ కురియన్ మార్గనిర్ధేశాలకు అనుగుణంగావినియోగదారుడి నుంచి ఆర్జించిన ప్రతి రూపాయిలో 85 శాతం పాడి రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో విజయ డెయిరీ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందని చలసాని తెలిపారు. ఈ సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు దాసరి వెంకట బాలవర్ధనరావు, వుయ్యూరు అంజిరెడ్డి, అర్జా వెంకట నగేశ్, చలసాని చక్రపాణి, వీబీకేవీ సుబ్బారావు, వేమూరి సాయి వెంకటరమణ, పల్లగాని కొండలరావు, బొట్టు రామచంద్రరావు, పాలడుగు వెంకట రామ వరప్రసాద్, నెలకుదిటి నాగేశ్వరరావు, చెరుకూరి లవయ్య, నెక్కలపు వాణిశ్రీ, శనగల వెంకట శివజ్యోతి, మద్దుకూరి వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.