తప్పతాగి దాష్టీకం
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:02 AM
భక్తిభావంతో కొనసాగాల్సిన తిరుపతమ్మ తిరునాళ్లలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆధ్యాత్మికతకు ఆలవాలంగా జరగాల్సిన వేడుకల్లో వికృతచేష్టలతో రెచ్చిపోయారు. మందుకొట్టారు.. మత్తులో డ్యాన్సులు వేశారు.. డీజేలతో హోరెత్తించారు.. బైకులతో విన్యాసాలు చేశారు.. ఇతర పార్టీల వారిపై రాళ్లు రువ్వారు.. అడ్డొచ్చిన పోలీసులపై ప్రతాపం చూపారు. ప్రతిష్టాత్మకమైన తిరుపతమ్మ తిరునాళ్లలో మంగళవారం రాత్రి జరిగిన ఈ అవాంఛనీయ ఘటనలకు వైసీపీ అల్లరిమూకలే ప్రధాన కారణమని తెలుస్తోంది.

తిరుపతమ్మ తిరునాళ్లలో ఘర్షణకు వైసీపీ కార్యకర్తలే కారణం
ప్రభలు, డీజేలతో ఒకటే పాటల హోరు
పూటుగా తాగి రోడ్ల వెంట అసభ్య నృత్యాలు
ద్విచక్రవాహనాలతో ప్రమాదకర విన్యాసాలు
టీడీపీ, జనసేన వాహనాలపైకి రాళ్లు
అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి
వైసీపీ వికృతాలను ఆపలేకపోయిన పోలీసులు
16 మందికి రిమాండ్.. మచిలీపట్నం తరలింపు
జగ్గయ్యపేట రూరల్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : తిరుపతమ్మ తిరునాళ్లను పురస్కరించుకుని మంగళవారం రాత్రి పెనుగంచిప్రోలు వైసీపీ ఆధ్వర్యంలో భారీగా డీజే వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. జగ్గయ్యపేట రోడ్డులోని తంభరేణి ఫంక్షన్ హాల్ నుంచి ఆలయం వరకు ర్యాలీగా బయల్దేరిన ఆ పార్టీ కార్యకర్తలు పెనుగంచిప్రోలు గ్రామంలో స్వైరవిహారం చేశారు. రోడ్లపై నృత్యాలు, ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. వారి వికృతచేష్టలకు పిల్లలు, మహిళలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడిపోయారు. డీజే వాహనాలు కిలోమీటర్ ప్రయాణించేందుకు సుమారు 7 గంటల సమయం పట్టింది. ఎట్టకేలకు రాత్రి 2 గంటల సమయంలో పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సెంటర్‌కు చేరుకున్నారు. అప్పటికే తిరుపతమ్మ పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు కుంకుమల బండి పెనుగంచిప్రోలు చేరుకుంది. ఆ బండి వెంట ట్రాక్టర్లు, ఎడ్లబళ్లు, డీజే వాహనాలు కూడా రావడంతో పోలీసులు వైసీపీ వాహనాలను నిలిపివేశారు. సుమారు గంటపాటు అనిగండ్లపాడు వాహనాలను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో పార్టీలవారీగా ఏర్పాటు చేసుకున్న డీజేల్లో పాటలు పెట్టుకుని ఎవరికి వారు హడావుడి చేశారు. సుమారు గంటపాటు ఈ పరిస్థితి కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రోడ్డు పక్కన ఉన్న రాళ్లకుప్ప నుంచి రాళ్లు తీసుకుని టీడీపీ, జనసేన వాహనాలపైకి విసిరారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు చాలామంది టీడీపీ, జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో స్థానిక పోలీసులెవరూ అక్కడ లేరు. ఎస్‌ఐ కూడా విధులను విడిచిపెట్టి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. పరిస్థితి విషమిస్తుండటంతో ప్రత్యేక విధులపై వచ్చిన విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్ర సమీపంలో ఉన్న సిబ్బందిని తీసుకుని హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్న వైసీపీ కార్యకర్తలు వారిపై కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి.
శాఖల మధ్య సమన్వయలోపం
అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిసినా.. తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవటం, శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వంటి పరిణామాలే ఈ పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి. అమ్మవారి పుట్టినిల్లయిన అనిగండ్లపాడు నుంచి చీర, సారె, పసుపు కుంకుమలు ఊరేగింపుగా తీసుకురావడం తిరునాళ్లలో ముఖ్యమైన ఘట్టం. దీనిని తిలకించేందుకు ఈ ఏడాది సుమారు 70 వేల మంది భక్తులు వస్తుంటారు. బందోబస్తు నిమిత్తం సుమారు 500 మంది పోలీసు సిబ్బందిని కూడా కేటాయించారు. అంతమంది సిబ్బంది ఉన్నా విధినిర్వహణలో అలసత్వం వల్ల అల్లర్లు జరిగాయి. చివరకు నలుగురు పోలీసు సిబ్బందిపై అల్లరిమూకలు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ ఎదుటే జరిగిన ఈ ఘటన విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లరిమూకలతో పాటు వారిని కట్టడి చేయడంలో విఫలమైన పోలీసులపై మండిపడుతున్నారు.
ప్రభలు, డీజే వాహనాలే అల్లర్లకు కారణం
పెనుగంచిప్రోలు తిరునాళ్లలో తొలినాళ్ల నుంచి రాజకీయ పార్టీల బలప్రదర్శన కొనసాగుతోంది. ప్రభలకు పార్టీ జెండాలు కట్టి ఊరేగింపులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా గతంలో ఎప్పుడూ దాడులకు తెగబడిన సందర్భాలు లేవు. ఈ ఏడాది వైసీపీ కార్యకర్తల మితిమీరిన ప్రవర్తన కారణంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. సుమారు 50 పసుపు కుంకుమల బళ్లు బయల్దేరగా, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలవారీగా నాయకుల వాహనశ్రేణి బయల్దేరింది. ఈ వాహనాల వెంటే డీజే వాహనాలు కూడా వచ్చాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించి ఆలయం వద్దకు చేరుకునే సరికి అర్ధరాత్రి 2 గంటలైంది. అప్పటికీ వేలమంది భక్తులు పసుపు కుంకుమలు తిలకించేందుకు వేచి ఉన్నారు. బళ్లు అక్కడకు చేరుకోవడంతో ఒక్కసారిగా భక్తులు కదిలారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో పసుపు కుంకుమ బండిని భక్తులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. పసుపు కుంకుమలను గుడిలోకి తీసుకెళ్లేందుకు చాలా సమయం పట్టింది.
పోలీసుల ఉదాశీనత
వైసీపీ ర్యాలీ ఆసాంతం భయానక వాతావరణంలో సాగుతున్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పసుపు కుంకుమల బండి ఆలయం వద్దకు చేరగానే పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు, వాహనాలతో పాటు పోలీసులపై కూడా దాడి చేసిన అల్లరిమూకలు స్టేషన్ ఎదుటే స్వైరవిహారం చేసినా కనీసం వారిని నిలువరించలేకపోయారు. అంత విధ్వంసం సృష్టించిన కార్యకర్తలను వెనుకేసుకొచ్చిన జగ్గయ్యపేట వైసీపీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు తన అనుచరులతో స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కొసమెరుపు. అల్లరిమూకలను సమర్థిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.
16 మందికి రిమాండ్
పెనుగంచిప్రోలు తిరునాళ్లలో అల్లర్లకు పాల్పడిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సోమవారం రాత్రి తిరునాళ్ల ఊరేగింపులో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటనలో కూటమి కార్యకర్తలతో పాటు నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. దీనిని సిరియ్‌సగా తీసుకున్న పోలీసులు వెంటనే 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈటూరి వెంకటేశ్వరరావు, తూము గోపి, గనిసెట్టి మణికంట, యర్రంశెట్టి నాగబాబు, కుంచాల సాయి, వేల్పుల అజయ్‌కుమార్, డేరంగుల యాదగిరి, జొన్నలగడ్డ శ్రీహరి, శివరామ్‌బొట్ల నాగవెంకటేష్, చేని మహేష్, పసుపులేటి వరుణ్‌కుమార్, దార గౌతమ్, నందిపాము పవన్‌కుమార్, దాసరి నాగబాబు, కాకాని సంజయ్, షేక్ మస్తాన్‌వలిలను అరెస్టు చేసి బుధవారం జగ్గయ్యపేట కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు మార్చి 2 వరకు రిమాండ్ విధించారు. వారిని మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మృతుడి బంధువుల ఆందోళన
తిరునాళ్లలో ఆనందంగా గడిపేందుకు వత్సవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన అన్నదమ్ములు గింజుపల్లి సాయిమణికంఠ, గోపీచంద్ మంగళవారం సాయంత్రం పెనుగంచిప్రోలు వచ్చారు. ఇద్దరూ క్రాస్ వీల్‌పై ఎక్కి సంతోషంగా ఉన్న సమయంలో వారు కూర్చున్న బుట్ట ఊడి పడింది. దూరంగా ఉన్న సిమ్మెంట్ రోడ్డుపై పడటంతో మణికంఠ (24) అక్కడికక్కడే మరణించగా, గోపీచంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే మణికంఠ చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. మణింకఠ మృతదేహంతో మంగళవారం రాత్రి పోలీ్‌సస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు గంట సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, తదితరులు మృతుడి తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు లీజుదారుడైన కాకాని శేషగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.