Share News

తొలి స్థానంలో ఆదోని మార్కెట్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:00 AM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌కు రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 105 శాతాన్ని సముపార్జించింది.

తొలి స్థానంలో ఆదోని మార్కెట్‌

రాయలసీమ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఆదాయం

సెస్సు రూపంలో రూ. 17.20 కోట్లు

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌కు రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 105 శాతాన్ని సముపార్జించింది. 2024-25 అర్థిక సంవత్సరానికి రూ.17.10 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా మార్చి 15 నాటికే రూ.17.20కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రాయలసీమ జిల్లాల్లోని మార్కెట్‌ కమిటీలలోనే ఆదాయపు వసూళ్ల లక్ష్యాన్నిమించి అగ్రశ్రేణిగా నిలిచింది. ఈ లెక్కన ప్రత్యక్షంగా రూ.1720 కోట్ల లావాదేవీలు జరిగాయి. రాష్ట్రంలోని గుంటూరు మార్కెట్‌ తర్వాత ఆదోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి అంత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆదోని అగ్రికల్చర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు జిల్లా రైతులే కాక పక్క జిల్లాలైన అనంతపురం, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం వేల మంది రైతులు విక్రయానికి తెచ్చిన పంట ఉత్పత్తులతో కళకళలాడుతుంటుంది. ఉమ్మడి జిల్లాలో 14 మార్కెట్‌ కమిటీలు ఉండగా ప్రధానంగా ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులు రెగ్యులేటెడ్‌ కమిటీలు 2024-25 కర్నూలు జిల్లాకు రూ.36.14 కోట్లు ఆదాయపు వస్తువుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు రూ.36.81 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగంపైగా ఆదోని మార్కెట్‌ యార్డ్‌ నుంచే ఆదాయం వచ్చింది. మిగతా మార్కెట్‌ కమిటీలు కర్నూలు, ఎమ్మిగనూరుతో పాటు చెక్‌ పోస్టులు వారపు సంత జరిగే ఆలూరు, కోసిగి, పత్తికొండ, కోడుమూరు మార్కెట్‌ కమిటీల నుంచి వచ్చాయి.

అంతా తెల్ల బంగారమే

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డలో 2024 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడు మార్చి 15 నాటి వరకు పత్తి 6,46,460 క్వింటాళ్లు విక్రయానికి వచ్చాయి. వాటి కనిష్ఠ ధర క్వింటం రూ.3960 కాగా గరిష్ఠ ధర రూ.8260 పలకగా వేరుశనగ 2,45,112 క్వింటాళ్లు వచ్చాయి. వాటి కనిష్ఠ ధర రూ.3016, గరిష్ఠ ధర రూ.7488 పలికింది. ఆముదాలు 50,591 క్వింటాళ్లు రాగా వాటి కనిష్ఠ ధర 2000, గరిష్ఠ ధర 6,150 పలికింది. పొద్దుతిరుగుడు 552 క్వింటాళ్లు కంది, వాము, పప్పుసెనగ దిగుబడులు కూడా వచ్చాయి. ఇందులో ప్రధానంగా పత్తి దూది, గింజలు నుంచి రూ.13కోట్లు వరకు సెస్సు రూపంలో ఆదాయం సమకూరింది. నిర్దేశించిన లక్ష్యంలో 70 శాతం తెల్ల బంగారం నుంచే మార్కెట్‌ కమిటీకి ఆదాయం వచ్చింది.

గత ఐదేళ్లలో ఆదోని మార్కెట్‌ యార్డ్‌ సమకూర్చిన ఆదాయం వివరాలు

ఏడాది లక్ష్యం వసూళ్లు

2020-21 రూ.1200 849.48

2021-22 రూ.1503 1608.5

2022-23 రూ.1600 1248.5

2023-24 రూ.1610 1416.9

2024-25 రూ.1710 1720

సమష్టి కృషితోనే లక్ష్యానికి మించి ఆదాయం

ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పటికీ 2024-25 ప్రభుత్వం నిర్డేశించిన ఆదాయపు వసుళ్ళ లక్ష్యాన్ని పక్కా ప్రణాళికతో సాధించగలిగాం. ఎప్పటికప్పుడు వ్యాపారుల జరిపిన లావాదేవీల నుంచి 1శాతం సెస్సు రాబట్టుకున్నాము. వ్యాపారులు కూడా మాకు సహకరించారు. మొండి బకాయిలపై దృష్టి పెట్టి వసూలు చేశాం. దీంతో నిర్దేశించిన లక్ష్యాన్ని మించి అధికంగా మార్కెట్‌ కమిటీకి ఆదాయాన్ని సమకూర్చాం.

- రామ్మోహన్‌ రెడ్డి, సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి, ఆదోని

Updated Date - Mar 20 , 2025 | 12:00 AM