దారులన్నీ మల్లన్న వైపే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:07 AM
శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తున్నారు.

ఉగాది ఉత్సవాలకు తరలివస్తున్న కన్నడిగులు
శ్రీశైలం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రతి ఏటా ఉగాది రోజున శ్రీశైలానికి చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని కర్ణాటక భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆత్మకూరు నుంచి వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీముని కొలను, కైలా ద్వారం మీదుగా శ్రీశైలానికి దుర్భేధ్యమైన అడవులను సైతం లెక్కచేయకుండా వస్తున్నారు. శ్రీశైలానికి వస్తున్న కన్నడ భక్తులకు దేవస్థానం భీముని కొలను, కైలా ద్వారం వద్ద తాగునీరు, అల్పాహారం, వైద్యసదుపాయాలు కల్పిస్తోంది. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో క్షేత్ర వీధులన్నీ రద్దీగా దర్శనమిస్తున్నాయి. కర్ణాటకతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.