Share News

బంతి బంతికి బెట్టింగ్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:31 AM

ట్వంటీ-ట్వంటీ ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల సీజన్‌ ప్రారంభమైంది.

బంతి బంతికి బెట్టింగ్‌

ఐపీఎల్‌ పోటీలతో ఊపందుకున్న క్రికెట్‌ బెట్టింగ్‌

రంగంలోకి పందెంరాయుళ్లు

నిఘాతోనే అడ్డుకట్ట

నంద్యాల క్రైం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ట్వంటీ-ట్వంటీ ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల సీజన్‌ ప్రారంభమైంది. బంతిబంతికి ఉత్కంఠ, క్షణాల్లో మారే ఫలితం ఆద్యంతం ఉద్వేగంతోపాటు కావాల్సినంత వినోదం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)క్రికెట్‌ అభిమానులకు అందిస్తోంది. వినోదం మాట అటుంచితే బెట్టింగ్‌రాయుళ్లకు మాత్రం ఐపీఎల్‌ కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణ, మండల ప్రాంతాలకు ఈ బెట్టింగ్‌ మానియా పాకింది.

కమీషన్ల కోసం...: నగరాలకు మాత్రమే పరిమితమైన బుకీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ బెట్టింగ్‌ దందా సాగిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేవారిని ఏజెంట్లుగా నియమించుకొని వ్యవహారాన్ని సాగిస్తున్నారు. వీరు బెట్టింగ్‌లు వేసేవారిని గుర్తించి వారి వివరాలు ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసేందుకు ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీగా ముట్టజెపుతున్నారు. యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, వీటివల్ల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని పోలీస్‌ శాఖ చైతన్యం చేసేలా తగిన చర్యలు చేపట్టేవిధంగా అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సిఉండగా ఆ దిశగా అడుగులుపడకపోవడంతో చాపకిందనీరులా బెట్టింగ్‌తతంగం జోరుగా నడుస్తోంది.

యువకులు, విద్యార్థులే లక్ష్యం..

జిల్లాలో అపార్ట్‌మెంట్లు, ఇంటర్నెట్‌ సెంటర్లను అడ్డాలుగా మార్చుకొంటూ బెట్టింగ్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులు, విద్యార్థులే లక్ష్యంగా దళారులు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. జిల్లాతో అనుబంధం ఉన్న కొందరు బుకీలు హైదరాబాద్‌, కర్నాటక, చెన్నై నగరాలతోపాటు స్థానిక ఏజెంట్లను ఏర్పాటుచేసుకొని ప్రొద్దుటూరు, బళ్లారి, తాడిపత్రి, మైదుకూరు తదితర ప్రాంతాలనుంచి చక్రం తిప్పుతూ బెట్టింగ్‌లను నడిపిస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో కొంతమంది రైతులు సైతం ఈ ఊబిలో కూరుకుపోయి పొలాలు అమ్ముకున్న పరిస్థితి కూడా గతంలో కనిపించింది. నంద్యాల పట్టణంలోని బుకీగా ఉన్న ఓ యువకుడు రూ.లక్షల్లో బెట్టింగ్‌ ద్వారా డబ్బు సంపాదించి అదేవిధంగా ఆ డబ్బును పోగొట్టుకొని కోట్లల్లో అప్పులు చేసుకొని సొంత ఊరినే వదిలేసి అజ్ఞాతంలో బతుకుతున్నాడు.

ఈజీ మనీ కోసం: ఈజీమనికి అలవాటుపడిన యువత బానిసలుగా మారుతున్నారు. ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్‌లు, మోటార్‌సైకిళ్లు తాకట్టు పెట్టి అధికవడ్డీలకు డబ్బులు తీసుకొని బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా గతంకంటే భిన్నంగా సెల్‌ఫోన్‌లోనే యాప్‌ల నుంచి జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

పోలీసుల నిఘాతోనే అడ్డుకట్ట

బెట్టింగ్‌లకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకొని ఎంతోమంది యువత ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమిత మయ్యాయి. పోలీసుల నిఘాతో అడ్డుకట్టవేసే అవకాశం ఉంది.

Updated Date - Mar 29 , 2025 | 12:31 AM