Share News

ఈ అన్నం తినేదెలా..?

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:09 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీలకు వరంగా మారింది.

ఈ అన్నం తినేదెలా..?
మాడిపోయిన అన్నం

మాడిపోయిన అన్నాన్ని పడేసిన విద్యార్థులు

పాఠశాలలో తాగునీరు కరువు

పట్టించుకోని ఉపాధ్యాయులు, అధికారులు

మంత్రాలయం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీలకు వరంగా మారింది. విద్యార్థులు మాత్రం మాడిపోయి, సంకటి ముద్దగా మారిన ఇలాంటి అన్నం ఎవరైనా తింటారా? అని పారేస్తున్నారు. మంత్రాలయం మండలంలోని సూగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వద్దు బాబోయ్‌.. ఈ అన్నం తినలేం.. అంటూ అనేక మంది విద్యార్థులు పడేశారు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 9వ రకు దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు. 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 6 గదులు మాత్రమే ఉన్నాయి. ఈ గదుల్లో తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో మధ్యాహ్న భోజనం పాఠశాల ప్రాంగణంలో చెట్ల కింద, ఎండకు వడగాలుల మధ్య వడ్డిస్తున్నారు. చెట్ల నీడలో, ఉపాధ్యాయుల మోటార్‌సైకిళ్లు, కుక్కల మధ్యనే నేలపై కూర్చొని తింటున్నారు. ఆకుకూరతో చేసిన నీళ్ల కూర తినలేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రోజూ ఇలాంటి భోజనం తినలేక కొంత మంది విద్యార్థులు ఇంటికి వెళ్లితిని వస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిధులు వెచ్చిస్తున్నా, ఈ పాఠశాలలో మాత్రం నిబంధనలు, మెనూ పాటించడంలేదు. ఎండాకాలంలో గంటకు ఒకసారి తాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు తగిన ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి బాటిల్‌లో నీరు తెచ్చుకొని దాహం తీర్చుకుంటున్నారు. నాడు-నేడు కింద మంజూరైన ఆర్వో ప్లాంటు రిపేర్‌లో ఉంది. హెచ్‌ఎం, ఉపాద్యాయులు, అధికారులు పట్టించుకోకపపోవడంతో వంట ఏజెన్సీ ఇష్టారాజ్యం నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మధ్యాహ్నం భోజన నిర్వహణ దుస్థితిని మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఈ భోజనం తినలేక పోతున్నాం

మాడిపోయి, ముద్దగా మారిన అన్నం, నీళ్ల ఆకుకూర తినలేకపోతున్నాం. ప్రతి రోజూ రుచిలేని ఈ భోజనం తినలేకపోతున్నాం. తాగడానికి నీళ్లు కూడా లేవు. ఇంటి నుంచి బాటిల్‌తో తెచ్చుకుంటున్నాం.

-ఓవిద్యార్థిని, 7వ తరగతి విద్యార్థిని

ఇక్కడ అన్నీ సమస్యలే.. నేనేమీ చేయలేను

ఈ పాఠశాలలో గదులు, నీరు, ప్రహరీ సమస్యలు ఉన్నాయి. రెగ్యులర్‌ హెచ్‌ఎం లచ్చప్ప 10వ తరగతి పరిక్షలకు చీఫ్‌ అధికారిగా వెళ్లారు. ఇక్కడ అన్నీ సమస్యలే ఉన్నాయి. నేనేమీ చేయలేను. -వెంకటరాముడు, ఇన్‌చార్జి హెచ్‌ఎం, సూగూరు

వంట ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం

సూగూరు ప్రాథమిక, జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. మెనూ పాటిస్తూ ప్రతిరోజు తాగునీరు పాఠశాలలో ప్రత్యేకంగా నిల్వ ఉంచాలని ఆదేశాలున్నాయి. తాగునీరు ఉపాధ్యాయులు ఏర్పాటుచేయాలి. ఎండకు చెట్టుకింద విద్యార్థులకు భోజనం పెట్టడం సరికాదు.

- మైనుద్దీన్‌, ఎంఈఓ, మంత్రాలయం.

Updated Date - Mar 29 , 2025 | 12:09 AM