జగనన్నా.. న్యాయం చెప్పన్నా..!
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:10 AM
జగనన్నా.. నువ్వే న్యాయం చెప్పన్నా..’ అన్న మాటలు ఏ సాధారణ మహిళనో అన్నవి కావు. వ్యాపార రంగంలో రెండో ముంబాయిగా పేరొందిన ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ బోయ శాంత ఆవేదన ఇది.

మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతి ఆవేదన
వాల్మీకి సంఘాల మద్దతు
ఆదోని టౌన్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘జగనన్నా.. నువ్వే న్యాయం చెప్పన్నా..’ అన్న మాటలు ఏ సాధారణ మహిళనో అన్నవి కావు. వ్యాపార రంగంలో రెండో ముంబాయిగా పేరొందిన ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ బోయ శాంత ఆవేదన ఇది. సొంతపార్టీ వైసీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై మున్సిపల్ చైర్‌పర్సన్ శాంత చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గానే కాకుండా కనీసం మహిళగా కూడా తనకు గౌరవం ఇవ్వకుండా తనపై ఇలా అవిశ్వాస తీర్మానానికి వైసీపీ నాయకులు, కౌన్సిల్ సభ్యులు సిద్ధం కావడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశానో చెప్పిన తర్వాతే తనపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా చైర్‌పర్సన్ శాంత చేపట్టిన నిరసన దీక్షకు ఆదివారం వాల్మీకి, బోయ సంఘం నాయకులు కలిసి మద్దతు ప్రకటించారు. అధ్యక్షుడు వీరేష్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్‌లో మెజారిటీ ఉన్న వైసీపీ సభ్యులు ఎలాంటి అవినీతి మరక లేని శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సమంజసం కాదన్నారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటిం చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు సురేష్, చంద్ర, మహాదేవ, నాగరాజు, గణేకల్ కొండయ్య, చిన్న హరివానం శివరాముడు, జయరాం, రాంబీం నాయుడు పాల్గొన్నారు.