పల్లె రోడ్లకు మహర్దశ..!
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:51 PM
సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గ్రామీణ, పట్టణ రహదారులకు మహర్దశ వచ్చింది.

రహదారుల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి
ఉమ్మడి జిల్లాకు రూ.25.9 కోట్లు మంజూరు
కర్నూలు జిల్లాలో రూ.10.10 కోట్లతో అభివృద్ధి
కౌతాళం-హాల్వి రోడ్డుకు మోక్షం
సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గ్రామీణ, పట్టణ రహదారులకు మహర్దశ వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంపెడు మట్టి కూడా వేయకపోవడంతో గుంతలు గుంతలుగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణం నరకప్రాయంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఉపశమనం కల్పించారు. తాజాగా శాశ్వత మరమ్మతులపై దృష్టి సారించారు. ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలో 220 రోడ్డ మరమ్మతులకు రూ.600 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోడ్లు భవనాలు శాఖ పర్యవేక్షణలోని కర్నూలు జిల్లాలో ఐదు రోడ్లకు రూ.10.10 కోట్లు, నంద్యాల జిల్లాలో ఏడు రోడ్లకు రూ.15.80 కోట్లు కలిపి రూ.25.90 కోట్లు నిధులు మంజూరు చేశారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడుతామని రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లు వెల్లడించారు.
కర్నూలు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో పాణ్యం నియోజకవర్గం పరిధిలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి 353/5 కి.మీ నుంచి 355/7 కిలోమీటర్ల వరకు 2.200 కిలోమీటర్లు అధ్వానంగా మారింది. శాశ్వత మరమ్మతులకు రూ.3.50 కోట్లు మంజూరు చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కలుగోట్ల-పార్లపల్లి రోడ్డు 0/00 కి.మీల నుంచి 5.130 కి.మీల వరకు, కైరవాడి నుంచి టి.సోమలగూడూరు వెళ్లే ప్రధాన రహదారి 15.00 కి.మీల నుంచి 24.900 కి.మీల వరకు, బనవాసి ఫారం నుంచి ఆదోని-ఎమ్మిగనూరు రోడ్డు వయా మల్కాపురం, కోటేకల్లు రోడ్డు 0.00 నుంచి 1.00 కి.మీల వరకు, సుంకేసుల-నాగులదిన్నె రోడ్డు 25.420 కి.మీల నుంచి 28.200 కి.మీల వరకు ఈ నాలుగు రోడ్లలో 18.810 కి.మీలు మరమ్మతులకు రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని కౌతాళం-హల్వీ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. గుంతలు పడి అధ్వానంగా మారిన ఈ రోడ్డు 9/2 నుంచి 13/8 కి.మీల వరకు 4.60 కి.మీలు పూర్తిగా దెబ్బతిన్న రహదారి మరమ్మతులకు రూ.2.30 కోట్లు ఇచ్చారు. ఆదోని నియోజకవర్గంలో గుంతకల్లు-తుంగభద్ర (జీటీబీ) రహదారి 58/8 నుంచి 59/4 కి.మీలు వరకు, 62/6 నుంచి 65/0 కి.మీల వరకు, హానవాల్ నుంచి కుంటనహాల్ రోడ్డు 4/0 నుంచి 8/0 కి.మీలు వరకు 7.60 కి.మీల మరమ్మతులకు రూ.2.10 కోట్లు, ఆదోని-సిరిగుంప రోడ్డు 15/0 నుంచి 18/0 కి.మీల వరకు, 24/0 నుంచి 26/7 కి.మీల వరకు మొత్తం 5.70 కిలో మీటర్ల మరమ్మతులకు రూ.3.50 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఐదు పనులకు 39.91 కిలో మీటర్లు మరమ్మతులకు రూ.10.10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నంద్యాల జిల్లాకు రూ.15.80 కోట్లు
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో రోడ్లు మరమ్మతుల నిధులు మంజూరు చేయడంతో ఆ జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీశైలం నియోజవకర్గంలో ఆత్మకూరు-కొట్టాలచెరువు రోడ్డు 1/7 - 7/6 కి.మీల వరకు 5.90 కి.మీలకు రూ.1.50 కోట్లు, రేగలగూడూరు - పాములపాడు రోడ్డు 0/0 నుంచి 5/2 కి.మీల వరకు రూ.2.20 కోట్లు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉయ్యాలవాడ-సుద్దమల్ల రోడ్డు 0/0 - 4/0 కి.మీల వరకు రూ.కోటి, దొర్రిపాడు - యల్లూరు రోడ్డు 8/5 - 12/5 కి.మీల వరకు రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. డోన్ నియోజకవర్గంలో సిమెంట్‌నగర్ - రామతీర్థం రోడ్డు 0/0 - 6/0 కి.మీల వరకు రూ.2.10 కోట్లు, పాణ్యం నియోజకవర్గం నందివర్గం-ఎస్.కొత్తూరు రోడ్డు 5/6 - 10/6 కి.మీల వరకు మరమ్మతులకు రూ.2.50 కోట్లు, నంద్యాల నియోజకవర్గం పరిధిలో చిత్తూరు-కర్నూలు (సీకే) జాతీయ రహదారి 281/300 - 284/00 కి.మీల వరకు, నంద్యాల బైపాస్ రోడ్డు 0/0 నుంచి 2/515 కి.మీల వరకు 5.215 కిలో మీటర్లు మరమ్మతులకు రూ.3 కోట్లు, సంజీవనగర్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు 800 మీటర్ల మేర రహదారి నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేశారు.