Share News

రాయితీకి సేద్యపు యంత్రాలు

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:58 PM

వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రమయ్యేకొద్దీ యాంత్రీకరణ పెరుగుతోంది. రూ.వేలు.. లక్షలు వెచ్చించి యంత్రాలు కొనలేని రైతులకు రాయితీపై ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

రాయితీకి సేద్యపు యంత్రాలు
ట్రాక్టర్ల ద్వారా పురుగు మందు పిచికారి చేస్తున్న రైతులు (ఫైల్‌)

జిల్లాకు రూ.2.86 కోట్ల సబ్సిడీ నిధులు

611 మంది రైతుల నుంచి దరఖాస్తులు

ధరల్లో భారీగా తేడా.. అధికారుల జేబుల్లోకి రాయితీ నిధులు

వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రమయ్యేకొద్దీ యాంత్రీకరణ పెరుగుతోంది. రూ.వేలు.. లక్షలు వెచ్చించి యంత్రాలు కొనలేని రైతులకు రాయితీపై ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. కూటమి ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ యంత్రాలను రైతులకు రాయితీపై ఇస్తోంది. జిల్లాలకు వ్యవసాయ యాంత్రీకరణ కోసం సబ్సిడీ నిధులు రూ.2.86 కోట్లు కేటాయించింది. వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల నుంచి 611 దరఖాస్తులు వచ్చాయి. అయితే.. వీటి ధరలు నిర్ణయించడంలో అధికారులు చేతివాటం కారణంగా సబ్సిడీ నిధులు దారి మళ్లుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

కర్నూలు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 4,19,221 హెక్టార్లు ఉంది. ప్రధానంగా పత్తి, వేరుశనగ, మిరప, కంది.. తదితర పంటలు సాగు చేస్తున్నారు. మరో 55 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 4,500 ట్రాక్టర్లు, 2,500 వరకు రోటోవేటర్లు, 25 వరకు వరి కోత మిషన్లు (ప్యాడీ త్రెషర్స్‌), 375 హార్వెస్టర్లు, 750కి పైగా మినీ ట్రాక్టర్లు, వందకు పైగా వపర్‌ టిల్లర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. వ్యవసాయంలో కూలీల కొరత కారణంగా ఏటేటా సీజన్‌లో వందల ట్రాక్టర్లు రైతులు కొనుగోలు చేస్తున్నారు. అదే క్రమంలో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు సులువుగా రుణాలు ఇస్తుడడంతో రైతులు డౌన్‌ పేమెంట్‌ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు వ్యవసాయ యాంత్రాలకు రాయితీ ఇవ్వకపోవడంతో యంత్రాలు, సేద్యపు పనిముట్లు, ట్రాక్టర్లు రైతులే పూర్తి ధర చెల్లించి బయట మార్కెట్లో కొనుక్కోవలసి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తా అనడంతో అన్నదాతలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

జిల్లాకు రూ.2.86 కోట్ల రాయితీ

జిల్లాలో 515 పవర్‌ స్ర్పేయర్లకు రూ.52 లక్షలు, 4 ట్రాక్టర్‌ ద్వారా పురుగు మందులు పిచికారి యంత్రాలకు రూ.1.64 లక్షలు, 23 బ్యాటరీలకు రూ.25 వేలు, 24 రోటోవేటర్లకు రూ.24 లక్షలు, 750 ట్రాక్టర్‌ దున్నకం చేసే వ్యవసాయ పనిముట్లకు రూ.2.05 కోట్లు, 5 పవర్‌ టిల్లర్లకు రూ.5 లక్షలు, 17 కలుపు మొక్కలు తొలగించే యంత్రాల (పవర్‌ వీడర్‌)కు రూ.5.95 లక్షలు, 13 కలుపు మొక్కలు కత్తిరింపు యంత్రాలు (బ్రష్‌ కట్టర్స్‌)కు రూ.5.68 లక్షలు చొప్పున దాదాపు 1,660 వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు రైతులకు రాయితీపై ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో మండలాల వారిగా పని చేసే వీటికి ప్రభుత్వం రాయితీ నిధులు రూ.2.86 కోట్లు కేటాయించింది.ఆన్‌లైన్లో ఇప్పటి వరకు కేవలం 611 మంది రైతులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామాల్లో సరైన ప్రచారం, అవగాహన కల్పించకపోవడం వల్ల రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

పూర్తి ధర.. సబ్సిడీ

ప్రభుత్వం ఇచ్చే రాయితీ వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు సరఫరా అనుమతి పొందిన పలు కంపెనీలు కోటేషన్లు ఇచ్చాయి. మోడల్‌ను బట్టి ఒక్కో కంపెనీ ఒక్కో ధర నిర్ణయించాయి. ట్రాక్టర్ల ద్వారా సేద్యం చేసే పనిముట్ల ధర కనిష్ఠం రూ.14,851, గరిష్ఠంగా రూ.3,31,500 ఉంది. వీటికి సబ్సిడీ రూ.7,425 నుంచి రూ.50 వేల వరకు ఇస్తారు. రోటోవేటర్‌ ధర కనిష్ఠంగా రూ.79,560, గరిష్ఠంగా రూ.1,45,860 ఉంటే.. రాయితీ ఎంచుకునే కంపెనీ రోటావేటర్‌ ధరపై రూ.50 వేలకు మించకుండా 50 శాతం ఇస్తారు. పవర్‌ స్ర్పేయర్ల కనిష్ఠ ధర రూ.9,435 నుంచి గరిష్ఠంగా 41,820 ఉంది. వీటికి రూ.10 వేలకు మించకుండా 50 శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. ట్రాక్టర్‌ ద్వారా పురుగుమందు పిచికారి చేసే స్ర్పేయర్ల ధర కనిష్ఠగా రూ.48,960 కాగా గరిష్ఠంగా రూ.6,88,500 కోటేషన్‌ ఇచ్చారు. రాయితీ మాత్రం రూ.41 వేలకు మించకుండా 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నది.

ధరల్లో తేడా.. అధికారుల జేబుల్లోకి రాయితీ

రాయితీ వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు సరఫరా కోసం ఆయా కంపెనీలు ఇచ్చిన కొటేషన్‌ ధరలకు, బయట మార్కెట్‌లో ధరలకు భారీగా తేడా ఉందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 515 పవర్‌ స్ర్పేయర్ల పంపిణీకి దరఖాస్తులు స్వీకరించారు. రైతులు ఎక్కువ శాతం 908, 708 నంబరు మోడళ్లను తీసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. వీటి ధర రూ.26,010కు వివిధ కంపెనీలు కొటేషన్‌ ఇచ్చాయి. అయితే.. బయట మార్కెట్‌లో రూ.21-22 వేలకు మించడం లేదని అంటున్నారు. అంటే ఒక్కో స్ర్పేయర్‌పై రూ.4-5 వేలు తేడా ఉంది. అలాగే.. రోటోవేటర్‌ గరిష్ఠ ధర రూ.1,45,860కు కొటేషన్‌ ఇచ్చారు. అవే కంపెనీ రోటోవేటర్‌ రూ.1.15 లక్షలకు మించడం లేదు. ఎమ్మిగనూరుకు చెందిన ఓ రైతు ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో రుణం తీసుకొని రోటోవేటర్‌ రూ.1.15 లక్షలకు కోనుగోలు చేశారు. దీనిపై రూ.30 వేల వరకు తేడా ఉందని అంటున్నారు. అంటే.. కంపెనీ ఇచ్చిన కొటేషన్లు ఆమోదం తెలిపిన అధికారులకు వాటా ఇవ్వాల్సి రావడంతోనే ధరల్లో భారీగా తేడా ఉంటుందని ఓ కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొనడం కొసమెరుపు.

మండలాల వారిగా కేటాయించిన యంత్రాలు, పనిముట్లు, వచ్చిన దరఖాస్తులు, రాయితీ నిధులు రూ.లక్షల్లో

మండలం యంత్రాలు/ రాయితీ దర

పనిముట్లు నిధులు ఖాస్తులు

ఆదోని 122 21.90 50

కోసిగి 71 11.87 28

కౌతాళం 78 12.29 34

పెద్దకడబూరు 57 9.3135

ఆలూరు 60 10.22 33

ఆస్పరి 61 10.50 21

చిప్పగిరి 32 6.01 23

హాలహర్వి 60 10.14 25

హొళగుంద 61 10.55 36

సి.బెళగల్‌ 72 12.23 37

గూడూరు 32 5.35 9

కల్లూరు 87 15.18 19

కోడుమూరు 73 13.23 15

కర్నూలు 73 12.64 33

ఓర్వకల్లు 63 10.23 27

దేవనకొండ 84 14.16 35

కృష్ణగిరి 50 8.89 8

మద్దికెర 34 5.95 14

పత్తికొండ 73 13.14 14

తుగ్గలి 74 12.70 0

వెల్దుర్తి 67 11.55 2

గోనెగండ్ల 66 11.15 -

మంత్రాలయం 61 10.42 32

నందవరం 61 10.43 --

ఎమ్మిగనూరు 88 16.76 1

మొత్తం 1,660 286.92 611

Updated Date - Apr 05 , 2025 | 11:58 PM