నిధులు లేక నిలిచిన పనులు
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:31 PM
వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల పనులు నిధులు లేక నిలిచిపోయాయి.

అర్ధాంతరంగా ఆగిన సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలు
అసంపూర్తి భవనాలపై దృష్టి సారించిన ప్రభుత్వం
నంద్యాల హాస్పిటల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల పనులు నిధులు లేక నిలిచిపోయాయి. నంద్యాల జిల్లాకు కేటాయించిన 415 సచివాలయాలకుగాను రూ.180 కోట్లు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో జిల్లాలో 361 సచివాలయ భవనాల నిర్మాణాలను చేపట్టారు. అందులో 292 సచివాలయాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 69 సచివాలయాలకు నిధులు మంజూరు చేయకపోవడంతో చివరి దశలో నిలిచిపోయాయి. మరో 54 సచివాలయాలు బేసెమెంట్‌కే పరిమితమయ్యాయి.
రైతుల భరోసా కేంద్రాల పరిస్థితీ అంతే...
జిల్లాకు 394 రైతుభరోసా కేంద్రాలు మంజూరు కాగా 281 ఆర్‌బీకే కేంద్రాలు నిర్మాణదశలో ఉన్నాయి. అందులో 222 ఆర్‌బీకేలు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. 59 ఆర్‌బీకే కేంద్రాలు నిధులు లేమితో నిలిచిపోయాయి. మరో 113 ఆర్‌బీకేలు బేస్‌మెంట్‌కే పరిమితమయ్యాయి.
అసంపూర్తి భవనాలపై..
అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు, ఆర్బీకేలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వెంటనే కలెక్టర్‌లతో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సచివాలయాల నిర్మాణానికి రూ.17 కోట్ల మేర నిధులు అవసరమని కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపారు.
రూ.126 కోట్ల బకాయిలు
వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల భవనాల శాఖకు దాదాపు రూ.126 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 59 పనులకు గాను ఈ బకాయిలు కాంట్రాక్టర్‌లకు చెల్లించాల్సి ఉంది. దాదాపు 70 శాతం పనులు పూర్తి చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. అంతేగాకుండా ఎండీఆర్ స్కీమ్ కింద రెండు పనులు మంజూరు కాగా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టకపోవడంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. రూ.5 కోట్లతో ఆళ్లగడ్డ-మాయలూరు మధ్యలో కుందూ నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలి, అలాగే రూ.2 కోట్లతో బ్రాహ్మణకొట్కూరు - మిడుతూరు మధ్యలో హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోవడంతో పనులను రద్దు చేశారు.