Share News

పదోన్నతుల కోసం ఎదురు చూపులు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:59 PM

రాష్ట్రంలోనే అత్యధిక పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతున్న కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులో పదోన్నతుల కోసం అధికారులు, సిబ్బంది సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు.

పదోన్నతుల కోసం ఎదురు చూపులు
కర్నూలు మార్కెట్‌ కమిటీ కార్యాలయం

ఖాళీ సోస్టులు భర్తీ కాకపోవడంతో సిబ్బందిపై పనిభారం

కర్నూలు మార్కెట్‌యార్డులో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట ఏదీ..?

కర్నూలు అగ్రికల్చర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే అత్యధిక పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతున్న కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులో పదోన్నతుల కోసం అధికారులు, సిబ్బంది సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. మరోవైపు పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో పనిభారం కొండలా పేరుకుపోతోందని అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారుల అక్రమాలను కట్టడి చేయడంలో అధికారులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. రైతుల పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర అందించడంతో పాటు వ్యాపారుల అక్రమాలను అరికట్టడానికి అవసరమైన అధికారులు సిబ్బంది లేకపోతే ఎలా? అని కర్నూలు మార్కెట్‌ కమిటీ యంత్రాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏటా ఈ మార్కెట్‌ కమిటికి పంట ఉత్పత్తుల విక్రయాలతో పాటు షాపుల అద్దె రూపేణా దాదాపు రూ.7 కోట్ల దాకా ఆదాయం వస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగే మార్కెట్‌ కమిటీలలో కర్నూలు మొదటి స్థానంలో నిలిచింది. కనీసం క్రయ విక్రయాలు ప్రతిరోజూ జరిగే మార్కెట్‌ కమిటీల్లోనైనా అధికారులను సిబ్బందిని నియమించడంలో మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదని, దీని వల్ల తాము నష్టపోతున్నామనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌ కమిటీలో ఒక సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీతో పాటు గ్రేడ్‌-1, 2 సెక్రటరీలు, అలాగే అసిస్టెంట్‌ సెక్రటరీలు ఇద్దరు ఉండాలి. ప్రస్తుతం గ్రేడ్‌-1 సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులు రెండు ఉండగా.. ఒక పోస్టులో ఉన్న అధికారిని పాణ్యం మార్కెట్‌ కమిటీకి డిప్యూటేషనపై పంపారు. పాణ్యం మార్కెట్‌ కమిటీ యార్డులో పంట ఉత్పత్తుల విక్రయాలు జరగడం లేదు. అటువంటప్పుడు అక్కడకు కర్నూలు మార్కెట్‌ కమిటీ నుంచి పంపాల్సిన అత్యవసర పని ఏముందో ఉన్నతాధికారులకే తెలియాలని పలవురు అంటున్నారు. అలాగే సూపర్‌వైజర్లు పది మంది ఉండాల్సి ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా పదోన్నతులు లభిస్తే అసిస్టెంట్‌ సెక్రటరీలుగా పక్క మార్కెట్‌ కమిటీలకు వెళ్లేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేశవరెడ్డి, శివన్న, నాగేష్‌, సూపర్‌వైజర్లు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా పదోన్నతులు లభించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్‌ శాఖ రాష్ట్ర అధికారులు సీనియారిటీ జాబితాలో ఉన్న అసిస్టెంట్‌ సెక్రటరీలు, సూపర్‌వైజర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:59 PM