Minister Nara Lokesh : వైసీపీ అక్రమాలపై త్వరలోనే యాక్షన్!
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:30 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యా మంత్రి లోకేశ్ చెప్పారు.
ప్రస్తుతం విచారణ జరుగుతోంది: లోకేశ్
విశాఖపట్నం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యా మంత్రి లోకేశ్ చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మద్యం సహా మొత్తం అక్రమాలపై విచారణ పూర్తయ్యాక త్వరలోనే ‘యాక్షన్’ మొదలవుతుందని తను భావిస్తున్నట్లు తెలిపారు. బుధవారం (8న) విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ఆదివారమిక్కడి కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రుషికొండలో నిర్మించిన ప్యాలె్‌సను ఏంచేయాలో అర్థం కావడం లేదని, రూ.700 కోట్లు దుర్వినియోగం చేశారని అన్నారు. గతంలో అక్కడున్న కాటేజీల కూల్చివేత వల్ల రూ.300 కోట్లు నష్టం వెరసి రూ.1000 కోట్లు వృథా అయ్యాయని ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమంత్రి భార్య కోసం సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని నిలదీశారు.
ఒక్క పరిశ్రమనైనా తీసుకురాకపోగా.. ఉన్నవాటిని తరిమేశారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక ఇబ్బందులున్న మాట వాస్తవమేనని.. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయని చెప్పారు. ఈ కర్మాగారం ప్రైవేటీకరణ జరగదని తేల్చిచెప్పారు. ‘మేం ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలను రప్పించి విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. టీసీఎస్ సెంటర్ మిలీనియం టవర్స్‌లోకి వస్తోంది. శాశ్వత సెంటర్‌కు రెండు, మూడేళ్లు పడుతుంది. ఐటీ కంపెనీలకు పెద్ద సెంటర్ నిర్మిస్తాం’ అని వివరించారు. అరకు కాఫీ వ్యాపారాన్ని రూ.300 కోట్ల నుంచి రూ.3 వేల కోట్లకు పెంచుతామన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు ఈగిల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు 8న ప్రధాని విశాఖ వస్తున్నారని తెలిపారు. నగరంలో ఆయన రోడ్‌షో ఉంటుందన్నారు. బహిరంగ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా హాజరుకావాలని పిలుపిచ్చారు.