Minister Nimmala Ramanaidu : మాయా మశ్చీంద్రను మించినోడు జగన్
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:53 AM
వాస్తవానికి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.4,000 కోట్లు నిధులు, రెండేళ్ల సమయం పడుతుంది.

‘వెలిగొండ’ 30% శాతం మాత్రమే పూర్తయింది
దానిని ప్రారంభించి, జాతికి అంకితం చేసేశారు: నిమ్మల
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘వెలిగొండ పనులు పూర్తికాకుండానే ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేశారు. వాస్తవానికి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.4,000 కోట్లు నిధులు, రెండేళ్ల సమయం పడుతుంది. మాయా మశ్చీంద్రకు కూడా సాధ్యం కానంతగా... జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారు’ అని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పనులను పూర్తి చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు, 25 లక్షల మందికి తాగు నీరు అందించే ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేయలేదు. శ్రీశైలం వద్దనున్న హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులను, ఫీడర్ కెనాల్ పనులను, నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులు చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారో జగనే చెప్పాలి’ అని మంత్రి నిమ్మల అన్నారు. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న పనుల జాబితాను చెపుతూ, ఒక్కో పనికి పట్టే కాలాన్ని ఆయన వివరించారు.