Share News

అధ్వానంగా పంచాయతీ రోడ్లు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:52 PM

పంచాయ తీ పరిధిలోని రహదారులు కంకరతేలి అధ్వా నంగా దర్శనమిస్తున్నాయి.

అధ్వానంగా పంచాయతీ రోడ్లు
గులకరాళ్లతో అధ్వానంగా దర్శనమిస్తున్న నల్లబల్లె ,రాజులగురువాయపల్లె రోడ్డు

ముద్దనూరు మార్చి 28(ఆంధ్రజ్యోతి):పంచాయ తీ పరిధిలోని రహదారులు కంకరతేలి అధ్వా నంగా దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్లపై వెళ్లాలం టేనే వాహనదారులు హడలిపోతున్నారు. ముద్ద నూరు మండలంలోని నల్లబల్లె గ్రామం నుంచి రాజులగురువాయపల్లెకు వెళ్లే దారిలో పొలాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రాజులగురువాయపల్లె, నల్లబల్లె గ్రామ రైతులు పొలాలకు వెళ్లాలంటే సరైన దారి లేకపోవడంతో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇక్కడి రైతులు దారి లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి తారు రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతో రాజులగురువాయపల్లె గ్రామస్థులకు పొలాలకు వెళ్లేందుకే కాకుండా ముద్దనూరు టౌన్‌కు వచ్చేందుకు చాలా తక్కువ ప్రయాణం ఉంటుంది. ప్రస్తుతం ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ఇక్కడ తారు రోడ్డు ఉండేదా? అని గుర్తు పట్టని విధంగా తయారైంది. అలాగే బొందలకుంట గ్రామం నుంచి బడుగువారుపల్లెకు ఎప్పుడో తారు రోడ్డు వేశారు. అయితే ప్రస్తుతం ఆరోడ్డు పూర్తిగా దెబ్బతిని తారు పోయి గులకరాళ్లు బయటపడి వాహనదారులు కాదుకదా పాదాచారులు అటు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ గ్రామ ప్రజలు ముద్దనూరు టౌన్‌కు ఈ రోడ్డు మీదుగా బొందకుంట మీదుగా వస్తుంటారు. ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలంటే చాలా అవస్థలు పడుతున్నారు.అయితే ఈ రెండు రోడ్లు పంచాయతీ రోడ్లు కావడంతో అభివృద్ధికి శాపంగా మారాయి.

రైతుల సమస్యలు గుర్తించి రోడ్డు వేశారు

రైతులు పొలం వద్దకు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారని అప్పటిలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గుర్తించి నల్లబల్లె నుంచి రాజులగురువాయపల్లె వరకు తారు రోడ్డు ఏర్పాటు చేశారు. దరాజులగురువాయపల్లె ప్రజలతో పాటు నొస్పంవారిపల్లె, పెనికెలపాడు, రాఘవాపురం గ్రామ ప్రజలు ముద్దనూరు కు వెళ్లాలంటే చాలా దగ్గర మార్గం ఇది.ప్రస్తుతం రోడ్డు పూర్తిగా దెబ్బతినింది.

-కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజులగురువాయపల్లె

రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపాం

ముద్దనూరు మండల పరిధిలోని రాజులగురువాయపల్లె, నల్లబల్లె రోడ్డు 4కిలోమీటర్లకు సంబందించి నాబార్డు నిధులు రూ.2 కోట్లు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పాం. బొందలకుంట, బడుగువారిపల్లె రోడ్డుకు ప్రతిపాదనలు పంపండం జరిగింది.

-:మునికుమార్‌, పీఆర్‌ ఏఈ,ముద్దనూరు

Updated Date - Mar 28 , 2025 | 11:52 PM