CM Chandrababu: నిందలు వేసి.. కుట్రలు
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:44 AM
పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై దోషం వేయాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించకపోవడం, తమ సంక్షేమ పథకాలను ప్రజలకు సరిగా చేరవేయకపోవడం వంటి అంశాలపై చర్చించారు,

ప్రవీణ్ మృతి నుంచి లబ్ధికి వైసీపీ ప్రయత్నం
నాడు బాబాయ్‌పై గొడ్డలి వేటు, కోడి కత్తి డ్రామాలు
ఎదుర్కోలేకపోయాం.. ఇప్పుడైనా గట్టిగా తిప్పికొట్టాలి
సోషల్ మీడియా వినియోగంలోనూ చాలా వెనుకబడ్డాం
మన పోస్టులను వాళ్లు వక్రీకరిస్తున్నారు.. వెంటనే
స్పందించకుంటే జనం వాటినే నమ్మే ప్రమాదం
4 రెట్లు సంక్షేమం చేస్తున్నా చెప్పుకోలేకపోతున్నాం: సీఎం
అమరావతి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు అన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రభుత్వంపై నిందలు వేసి.. అప్రతిష్ఠ పాల్జేసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘గతంలో బాబాయ్ గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాల విషయంలో మనపై వైసీపీ పూర్తి అవాస్తవాలతో తప్పుడు ఆరోపణలు చేసింది. మనం ఎలాంటి తప్పూ చేయకున్నా వాటిని సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యాం. పాస్టర్ ప్రవీణ్ ఉదంతంతో లబ్ధి పొందేందుకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనిని సమర్థంగా తిప్పికొట్టాలి’ అని ఆదేశించారు. ప్రవీణ్ మృతి కేసును సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సీసీ ఫుటేజీలు కీలకంగా మారాయని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా సమర్థ వినియోగంలో కూడా చాలా వెనుకబడి ఉన్నామని చెప్పారు. ‘మనం మంచి ఉద్దేశంతో పెట్టే పోస్టులనూ వక్రీకరించి చెడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారు.
ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించకుంటే.. వక్రీకరించిన వాటినే ప్రజలు నిజమని నమ్ముతారు. మంత్రులందరూ అప్రమత్తంగా ఉండి మరింత సమర్థంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చిచూసినా నాలుగు రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, కానీ ఆ స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నామని పెదవివిరిచారు. చేస్తున్న మంచిని జనంలోకి తీసుకెళ్లడంలో వెనుకబడుతున్నామన్నారు. మన పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని.. దీనికి సామాజిక మాధ్యమాలనూ వాడుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News