Share News

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:05 PM

Pawan Kalyan : మాదగ కులానికి వన్నె తెచ్చిన మందకృష్ణకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. గుర్తింపు లేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
Dy CM Pawan Kalyan

అమరావతి, మార్చి 20: ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. మంద కృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మాదగ కులానికి వన్నె తెచ్చిన మందకృష్ణకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. గుర్తింపు లేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.


ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు అధిక శాతం ఉన్నారని గుర్తు చేశారు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2026లో జనగణన జరుగుతుందని తెలిపారు జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగిరీల విభజన ఉంటుందన్నారు. A, B, C, D కేటగిరీల కోసం 1996లో కమిటీ వేశామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారమవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కమిషన్ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా దామాషా ప్రకారం రిజర్వేషన్ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో దళితులు అగ్రపథాన నిలిచారని గుర్తు చేశారు. దళిత వాడల్లో సంపద సృష్టి జరిగిందని వివరించారు. 800 ఎకరాలు దళితుల భూములు ఇడుపులపాయ ఎస్టేట్‌లో జగన్‌రెడ్డి కుంటుంబం ఆక్రమించుకుందని ఆయన ఆరోపించారు.


ఇక టీడీపీ మరో ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీలకు సంబంధించిన అనేక పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం టీడీపీ మొదటి నుంచీ కట్టుబడి ఉందని ఆయన గుర్తు చేశారు.


అంతకుముందు ఎస్సీ వర్గికరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉభయ సభల ముందు ప్రవేశపెట్టారు. దీనిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అందులోభాగంగా ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడితోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు సభలో మాట్లాడారు.

Also Read:

పోలీసుల విచారణకు విష్ణుప్రియ... మొబైల్ సీజ్

అందుకేమరి.. కాస్త చూసుకొని మాట్లాడాలనేది.. ఏం

సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 20 , 2025 | 03:13 PM