Tirumala: తిరుమలలోని అనధికార గృహాల్లో సోదాలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:11 AM
కొందరి వివరాలను, వారి నేర చరిత్రను సేకరించారు. తిరుమలలో కొందరు ఉచిత భోజనం, వసతి సదుపాయాలను వినియోగించుకుంటూ అనధికారికంగా తిష్ట వేశారు. హాకర్లుగా, భవన కార్మికులుగా పనులు చేసుకునే కొందరు మాంసాహారం తింటూ, మద్యం, గంజాయి తీసుకుంటూ హల్‌చల్ చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో తొలగించనున్న అధికారులు
తిరుమల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో అనధికారికంగా ఉంటున్న వ్యక్తుల నివాసగృహాల్లో ఆదివారం పోలీసులు, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. కొందరి వివరాలను, వారి నేర చరిత్రను సేకరించారు. తిరుమలలో కొందరు ఉచిత భోజనం, వసతి సదుపాయాలను వినియోగించుకుంటూ అనధికారికంగా తిష్ట వేశారు. హాకర్లుగా, భవన కార్మికులుగా పనులు చేసుకునే కొందరు మాంసాహారం తింటూ, మద్యం, గంజాయి తీసుకుంటూ హల్‌చల్ చేస్తున్నారు. ఇలాంటి వారికి షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్, పాచికాల్వ గంగమ్మ ఆలయ ప్రాంతంలోని తాత్కాలిక షెడ్లు నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ ముందు షెడ్‌లో ఇద్దరు మద్యం తాగి మాంసం తింటూ పట్టుబడ్డారు. మాడవీధుల్లో ఒకరు మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ హల్‌చల్ చేశారు. మూడురోజుల క్రితం ఇద్దరు యువకులు మద్యం మత్తులో భక్తుల వాహనాలను అడ్డుకోవడంతోపాటు ముగ్గురిపైౖ దాడికి దిగారు. ఇలా దాదాపు 200 మందికిపై అనధికార వ్యక్తులు తిరుమలలోనే ఉంటూ క్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తున్నారు.
ఈ క్రమంలో అధికారులు వీరిపై దృష్టి పెట్టారు. పాచికాల్వ గంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గృహాల్లో భద్రతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 20 మంది అనధికార వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లను ఖాళీ చేయించి తిరుపతికి తరలించారు. రెండుమూడురోజుల్లో టీటీడీ అధికారుల అనుమతితో ఈ అనధికార నివాసగృహాలను తొలగించనున్నారు. తిరుమలలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న 72 మందిని శనివారం గుర్తించారు. వీరిలో పాత నేరస్థుడూ ఉండటం గమనార్హం.