Share News

Poultry industry: పౌల్ట్రీ.. పరేషాన్!

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:23 AM

బర్డ్‌ఫ్లూ వల్ల లక్షలాది కోళ్లు మృత్యువాత పడినా.. మనుషులకు ఏ ప్రమాదం లేదన్న విషయంపై అధికారులు ప్రచారం చేసినా ప్రజల్లో భయం పోలేదు. పౌల్ర్టీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పలు నగరాల్లో చికెన్‌ మేళాలు నిర్వహిస్తే.. ఉచితంగా ఆరగించడానికి చికెన్‌ ప్రియులు పోటెత్తారు.

Poultry industry: పౌల్ట్రీ.. పరేషాన్!

దెబ్బతీసిన బర్డ్‌ ఫ్లూ.. వేసవితో మరింత నష్టం

గత సర్కారు పౌల్ర్టీ పాలసీతో సంక్షోభంలోకి..

పునఃసమీక్షించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి

సీఎం ఆదేశాలతో కదిలిన పశు సంవర్ధక శాఖ

రాష్ట్రంలో పౌల్ర్టీ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది! కోళ్ల పెంపకందార్లకు గత ఐదేళ్లుగా ప్రోత్సాహం కరువవడంతోపాటు ఈ ఏడాది బర్డ్‌ ఫ్లూ పౌల్ర్టీ రైతులను మరింత దెబ్బతీసింది. కొన్నేళ్లుగా దాణా ధరల పెరుగుదల, విద్యుత్‌ చార్జీల భారం, కూలీల డిమాండ్‌, వాతావరణ పరిస్థితులతో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ వస్తున్న పౌల్ర్టీ రైతులు ఈ దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు! ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. తమను అగాధంలోకి నెట్టేసిన జగన్‌ సర్కారు పౌల్ర్టీ పాలసీని పునఃసమీక్షించడంతోపాటు, రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని.. ఇతరత్రా చేయూతనందించి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని పౌల్ర్టీ రైతులు ఇటీవల సీఎంను కలిశారు!.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు 3వేలు, గుడ్లు ఉత్పత్తి చేసే ఫారాలు 1,200 ఉన్నాయి. మొత్తం పౌల్ర్టీ ఫారాల్లో 6 కోట్ల దాకా కోళ్లు ఉన్నాయి. రోజుకు సుమారు 4.5కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. కానీ రెండు నెలలుగా బర్డ్‌ఫ్లూపై భయంతో గుడ్లు, చికెన్‌ వినియోగం తగ్గింది. వాస్తవానికి అమెరికాలో బర్డ్‌ఫ్లూ వస్తే.. మార్కెట్‌లో ఉన్న గుడ్లు, చికెన్‌కు డిమాండ్‌ వచ్చింది. కానీ భారత్‌లో బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో చికెన్‌ షాపుల్ని బంద్‌ చేయించడంతో ప్రజల్లో అపోహలు తలెత్తాయి. బర్డ్‌ఫ్లూ వల్ల లక్షలాది కోళ్లు మృత్యువాత పడినా.. మనుషులకు ఏ ప్రమాదం లేదన్న విషయంపై అధికారులు ప్రచారం చేసినా ప్రజల్లో భయం పోలేదు. పౌల్ర్టీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పలు నగరాల్లో చికెన్‌ మేళాలు నిర్వహిస్తే.. ఉచితంగా ఆరగించడానికి చికెన్‌ ప్రియులు పోటెత్తారు. ఓ వైపు బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోగా, మరోవైపు చికెన్‌, గుడ్లు అమ్మకాలు, ఎగుమతులు మందగించాయి. దీంతో పౌల్ర్టీలకు రూ.లక్షల్లో నష్టాలొచ్చాయి. ఎండలకు కోళ్లు చనిపోవడం, గుడ్లు ఉత్పత్తి తగ్గడం సహజం. కానీ రానున్న 80 రోజులు వేసవి ప్రభావంతో పౌల్ర్టీలు మూతపడే అవకాశం ఉంది. పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరా నిలిచిపోనున్నది. ఇవే పరిస్థితులు ఇంకొన్నాళ్లు కొనసాగితే.. పౌల్ర్టీ పరిశ్రమ దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని యజమానులు ఆందోళన చెందుతున్నారు.


గత సర్కారు పాలసీతోనే సంక్షోభంలోకి..

ఇప్పటికే పౌల్ర్టీ పరిశ్రమ సంక్షోభంలో నడుస్తున్నది. గత ప్రభుత్వం తెచ్చిన పౌల్ర్టీ పాలసీతోనే కోళ్ల ఫారాల నిర్వాహకులు కుదేలయ్యారు. పౌల్ర్టీ కాంప్లెక్స్‌ల ఏర్పాటు, విద్యుత్‌ చార్జీలు, దాణా తయారీ, రవాణా, గుడ్లు ఎగుమతుల వంటి విషయాల్లో అనేక సమస్యలు చవిచూశారు. పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేసిన గుడ్లకు బిల్లులు కూడా సకాలంలో రాక పౌల్ర్టీ యజమానులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కోళ్ల దాణా ధరలు నికరంగా ఉన్నా.. గత ఐదేళ్లూ దాణా ధరలు అనేక రెట్లు పెరిగి, నిర్వహణ భారమైందని పౌల్ర్టీ యజమానులు చెప్తున్నారు. కాగా గత టీడీపీ ప్రభుత్వం పౌల్ర్టీ రైతులకు రాయితీలిచ్చి, ప్రోత్సహించింది. కానీ వైసీపీ ప్రభుత్వం నయాపైసా సాయం చేయలేదు.

ఇదీ పౌల్ర్టీ ఫెడరేషన్‌ విజ్ఞప్తి

రాష్ట్రంలో పౌల్ర్టీ పరిశ్రమ పరిస్థితిపై ఏపీ పౌల్ర్టీ ఫెడరేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇటీవల కలిశారు. పౌల్ర్టీ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా గత ప్రభుత్వంలో తెచ్చిన పౌల్ర్టీ పాలసీని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లేయర్‌ పౌల్ర్టీ ఫార్మర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. ‘పౌల్ర్టీ రంగానికి గతంలో మాదిరిగా చేయూత అందించాలి. కోళ్ల దాణాకు వినియోగించే మొక్కజొన్న ఉత్పత్తిపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయించేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలను తారుమారు చేసే విధానాలను నియంత్రించడానికి పౌల్ర్టీ రైతులు, గుడ్డు వ్యాపారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి. 2018-19లో పౌల్ర్టీ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.45.65 కోట్ల రాయితీ సొమ్ముకు టోకెన్లు ఉన్నా.. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినందున.. ఆ నిధులు విడుదల చేయాలి., ఇప్పటికే బ్యాంకులకు బకాయి ఉన్న పౌల్ర్టీ రైతుల రుణాలను ఏడాది పాటు రీషెడ్యూల్‌ చేసేలా ఆదేశాలివ్వాలి. కోళ్ల దాణా విధానాన్ని బలోపేతం చేయాలి. సూపర్‌ స్పెషాలిటీ సౌకర్యంతో ప్రతి జిల్లాలో కోళ్ల వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలు పెంచాలి. కల్తీ మందుల నిర్ధారణకు చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం ఆదేశాలతో పశు సంవర్ధకశాఖ ఒక ఫైల్‌ తయారు చేసింది. తమ సమస్యలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని, పౌల్ర్టీ పరిశ్రమను ఆదుకోవాలని పౌల్ర్టీ ఫెడరేషన్‌ కోరుతోంది.


చికెన్‌లో పురుగుల కలకలం

సామర్లకోట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): బర్డ్‌ ఫ్లూ కారణంగా కొంత కాలంగా చికెన్‌కు దూరంగా ఉంటున్న పలువురు ఉత్సాహంగా ఆదివారం చికెన్‌ కొనుగోలు చేశారు. అయితే ఇంటికొచ్చాక చికెన్‌ నుంచి పురుగులు వస్తుండటం చూసి కలవరం చెందారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో పాత తహశీల్దార్‌ కార్యాలయం ప్రాంతానికి చెందిన ఇద్దరు సంత మార్కెట్‌ రామాలయం సమీపంలోని ఒక చికెన్‌ దుకాణంలో కొనుగోలు చేసిన చికెన్‌లోనే ఈ పురుగులు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయం వెలుగుచూడకుండా చికెన్‌షాపు యజమాని వారిని సంతృప్తి పరిచినట్లు తెలిసింది. ఆదివారం కావడంతో ఈ విషయం తమ దృష్టికి రాలేదని మున్సిపల్‌ శానిటరీ అధికారులు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 03:23 AM