పంచాయతీలకు ట్రాక్టర్లు
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:27 AM
స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను తరలించేందుకు వీటిని వినియోగించాల్సి ఉంది. 2వేల జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున కేటాయించింది.

చెత్త తరలింపునకు మూడు డివిజన్లకు 98 కేటాయింపు
రెండు వేల జనాభా ప్రాతిపదిక
నేడు కొండపిలో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి స్వామి
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను తరలించేందుకు వీటిని వినియోగించాల్సి ఉంది. 2వేల జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున కేటాయించింది. జిల్లాకు మొత్తం 114 ట్రాక్టర్లు మంజూరు చేయగా తొలివిడతగా 98 పంచాయతీలకు పంపించారు. ఒంగోలు డివిజన్‌కు 35, కనిగిరి డివిజన్‌కు 35, మార్కాపురం డివిజన్‌కు 28 ట్రాక్టర్లను కేటాయించారు. వీటిని నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్న విషయం విదితమే. ఇప్పటివరకు చిన్న వాహనాల్లో మాత్రమే సేకరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జనాభా అధికంగా ఉన్న గ్రామాలకు ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా అవి శుభ్రంగా ఉండటంతోపాటు ఏరోజుకారోజు గ్రామంలోని చెత్తను తరలించేందుకు దోహదపడనున్నాయి.