Share News

పాఠశాలల్లో వాటర్‌ బెల్‌

ABN , Publish Date - Mar 27 , 2025 | 02:26 AM

వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా కనీసం మూడుసార్లు పాఠశాలల్లో మంచినీరు తాగేందుకు వీలుగా ప్రభుత్వం వినూత్నంగా వాటర్‌బెల్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

పాఠశాలల్లో వాటర్‌ బెల్‌

ప్రతి రోజూ మూడు సార్లు

వేసవి నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు

ఒంగోలు విద్య, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా కనీసం మూడుసార్లు పాఠశాలల్లో మంచినీరు తాగేందుకు వీలుగా ప్రభుత్వం వినూత్నంగా వాటర్‌బెల్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం 10, 11, 12 గంటలకు పిల్లలు మంచినీళ్లు తాగేందుకు వీలుగా మూడుసార్లు ప్రత్యేకంగా బెల్‌ కొడతారు. తరగతుల ప్రారంభం, ముగిసిన తర్వాత కొట్టే బెల్‌కు భిన్నంగా 15 సెకండ్లు కొత్త శబ్దంతో దీన్ని కొడతారు. ఇది మోగగానే తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం ఆపేసి పిల్లలు మంచినీరు తాగేందుకు అవకాశం ఇవ్వాలి. అలాగే మంచినీళ్లు తాగమని ప్రోత్సహించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Mar 27 , 2025 | 02:26 AM