Share News

కార్గో సేవలు అట్టర్‌ ప్లాప్‌..!

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:46 PM

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ.. ఆదాయ వనరుల పెంపుకోసం ఏర్పాటు చేసిన కార్గో కొరియర్‌ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. మొదట్లో నెలకు రూ.45 లక్షల వరకు ఆదాయం ఉండగా, నేడు రూ.10లక్షలు కూడా రాని పరిస్థితులకు దిగజారిపోయింది.

కార్గో సేవలు అట్టర్‌ ప్లాప్‌..!

గంటల కొద్ది పడిగాపులు..

సమాధానం చెప్పేవారు కరువు

నాడు నెలకు రూ.45లక్షల వరకు ఆదాయం

నేడు రూ.10 లక్షలకు పడిపోయిన వైనం

అక్కడ సిబ్బంది ఇష్టారాజ్యమే కారణం

ఒంగోలు, కార్పొరేషన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ.. ఆదాయ వనరుల పెంపుకోసం ఏర్పాటు చేసిన కార్గో కొరియర్‌ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. మొదట్లో నెలకు రూ.45 లక్షల వరకు ఆదాయం ఉండగా, నేడు రూ.10లక్షలు కూడా రాని పరిస్థితులకు దిగజారిపోయింది. ముఖ్యంగా సిబ్బంది నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం, పైనుంచి పర్యవేక్షణలోపం తోడు కావడంతో సేవలు మొక్కుబడిగా మారాయి.

పడిపోయిన ఆదాయం

ఒంగోలుడిపో ఆవరణలో ఉన్న కార్గో కార్యాలయంలో పూర్తిగా ప్రైవేటు సిబ్బంది ఉండటంతో వారిపై అజమాయిషీ కొరవడింది.మొదట్లో మార్కెటింగ్‌ చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగుల్లోని ఐదుగురిని నియమించారు. ప్రస్తుతం మార్కెటింగ్‌ సేవలు నిలిపివేయడంతో ఆదాయవనరులు మరింత తగ్గిపోయాయి. ఒకప్పుడు ప్రజలకు సులభతరంగా అందిన కార్గో సేవలు ఇప్పుడు మొక్కుబడిగా మారాయి. ఒక్కో బుకింగ్‌కు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. అలాగే పార్శిళ్లను తీసుకునేందుకు వచ్చిన కస్టమర్లకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు.


డోర్‌ డెలివరీ సేవలు నిల్‌

వాస్తవానికి వివిధ పార్శిళ్లను ఇంటి వద్దకే అందించాల్సి ఉంది. అందుకోసం ప్రతి పార్సిల్‌కు బరువు ఆధారంగా ధరలు నిర్ణయించారు. 1 కేజీ వరకు రూ.18 వసూలు చేయగా, 1 నుంచి 6 కేజీల వరకు రూ.30,6 కేజీల నుంచి 10 కేజీల వరకు రూ.36,10 కేజిల నుంచి 25 కేజీల వరకురూ.48, 25 కేజీల నుంచి 50 కేజీల వరకు రూ.59 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ సదుపాయం 50 కేజీల బరువు గల పార్శిల్‌కు ఎంపికచేసిన నగరాల పరిధిలో 10 కిలోమీటర్ల దూరంలోనే అందించేలా చర్యలు చేపట్టారు. నేటికి ఒక్క ఇంటికి కూడా సర్వీసులు లభించలేదంటే ఆశ్చర్యం వేయక తప్పదు.

డిపో మేనేజర్లతో నేడు ఆర్టీసీ ఈడీ సమీక్ష

ఒంగోలులోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఫ్రీపార్కింగ్‌ లేదు. ప్రతిరోజు వేలసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా తాగునీరు అందుబాటులో లేదు. అసలే వేసవికాలం కావడంతో తాగునీరు లేకపోవడం పట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ శుక్రవారం ఒంగోలు జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.సమావేశానికి జిల్లాలోని డిపో మేనేజర్లు, ఆర్టీసీ ట్రాఫిక్‌ సీఐలు, గ్యారేజ్‌ అధికారులు హాజరుకానున్నారు. సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Updated Date - Mar 27 , 2025 | 11:46 PM