Share News

దళితులకు అండగా కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:35 AM

కూటమి ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

దళితులకు అండగా కూటమి ప్రభుత్వం

మార్కాపురం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక భగత్‌సింగ్‌ కాలనీకి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దశాబ్ధాలుగా 9వ వార్డు నుంచి 19వ వార్డు వరకుగల ప్రజలు శ్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంతోమంది శ్మశానం లేక పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అప్పట్లో తాను శ్మశానం ఏర్పాటుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు. సుమారు 20 వేల మంది ప్రజలు పడు తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో భగత్‌సింగ్‌ కాలనీకి సమీపం లో నూతన శ్మశానానికి అనువైన స్థలాన్ని సేకరించా మన్నారు. భవిష్యత్తులో మున్సిపాలిటీ నిధులతో శ్మశానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలకు చెందిన ఫాస్టర్లు ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు దూదేకుల మస్తానయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్‌ మౌలాలి, కౌన్సిలర్లు నాలి కొండయ్య, కశ్శెట్టి నగేష్‌, దారివేముల హర్షితబాబీ, నాయకులు ధనంకుల హరిబాబు, మాజీ కౌన్సిలర్లు జవ్వాజి రాజు, చిత్తారి పెద్దన్న, ఫాస్టర్లు ఫ్రాంక్లిన్‌, ఆదాము, మంచా ఏలియా, ఆండ్రూస్‌, సామ్యేల్‌, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

30 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌

తర్లుపాడు, మార్చి 23 ఆంధ్రజ్యోతి: మండలంలోని జగన్నాథపురంలో ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. క్రీడల కరపత్రాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విడుదల చేశారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.70 వేలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.30 వేలు, నాలుగో బహుమతి రూ.20వేలు, ఐదో బహుమతి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొనదలిచిన వారు ఈ నెల 20లోపు ఎంట్రీ ఫీజు రూ.2 వేలు చెల్లించి రసీదు పొందాలన్నారు. పూర్తి వివరాలకు 7780603930, 9346870549 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Updated Date - Mar 24 , 2025 | 12:35 AM